Manipur Viral Video: 


మోదీపై విమర్శలు..


మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. మొత్తం పార్లమెంట్‌ని కుదిపేసింది. ఇంత జరుగుతున్నా కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విపక్షాలు ఆందోళనకు దిగాయి. మొదలైన కాసేపటికే రెండు సభలూ వాయిదా వేయాల్సి వచ్చింది. విపక్షాల ఆందోళనల మధ్య సభ కాసేపు కూడా సజావుగా సాగలేదు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించినప్పటికీ ప్రతిపక్ష నేతలు మాత్రం నిరసనలు ఆపలేదు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలన్న కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. అక్కడి పరిస్థితులు అదుపులోకి తీసుకురావాలంటే ఇదే మార్గం అని తేల్చి చెబుతున్నారు. అంతే కాదు. ముఖ్యమంత్రి బైరెన్ సింగ్‌ని ఆ పదవి నుంచి తొలగించాలనీ డిమాండ్ చేస్తున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ ఈ విషయంలో చాలా సీరియస్‌గా స్పందించారు. కేంద్రం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్దవ్ బాల్‌థాక్రే శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీతో పాటు కేంద్రమహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీపై మండి పడ్డారు. పార్లమెంట్‌లో కచ్చితంగా దీనిపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఫైర్ అయ్యారు. ఓ వీడియో వైరల్ అయ్యేంత వరకూ ప్రధాని మోదీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇప్పటికీ అక్కడ ఇంకా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. 


మహిళలపై అమానుషంగా ప్రవర్తిస్తున్న వారిని వదిలిపెట్టకూడదని NCP చీఫ్ శరద్ పవార్ డిమాండ్ చేశారు. ఈ రెండు నెలల అశాంతికి స్వస్తి పలికి అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనేలా కేంద్రహోం శాఖ చొరవ తీసుకోవాలని అన్నారు. 


"మణిపూర్‌లోని ఇద్దరి మహిళలపై దాడి జరిగిన తీరు అమానుషం. ఈ వీడియోలు చూసి చలించిపోయాను. ఇది కచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఇప్పుడు అంతా ఒక్కటవ్వాల్సిన సమయం. అక్కడి ప్రజలకు న్యాయం జరిగేంత వరకూ నినదిద్దాం. ప్రధాని మోదీ సహా కేంద్రహోం శాఖ జోక్యం చేసుకుని మణిపూర్‌లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలి"


- శరద్ పవార్, ఎన్‌సీపీ చీఫ్ 






శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఈ విషయంలో మౌనంగా ఉండడం తగదని అన్నారు. పార్లమెంట్‌లో కచ్చితంగా ఆయన మాట్లాడాలని డిమాండ్ చేశారు. 


"ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ అల్లర్లపై మౌనాన్ని వీడాలి. పార్లమెంట్‌లో తప్పనిసరిగా దీనిపై మాట్లాడాలి. కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ స్మృతి ఇరానీకి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. ఆమె వెంటనే రాజీనామా చేయాలి"


- ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ 


Also Read: Viral News: మొబైల్ వాడొద్దని మందలించిన తల్లిదండ్రులు, వాటర్‌ఫాల్స్‌లోకి దూకి బాలిక ఆత్మహత్యాయత్నం