Manipur News: మణిపూర్‌లో ఒక సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బయటకు రావడం తనను తీవ్రంగా కలచివేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలను అస్సలు అంగీకరించలేమని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాము తీసుకుంటామని సీజేఐ అన్నారు.


దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. దీనిపై వచ్చే శుక్రవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ.. 'ఈ ఫొటోలు చూసి షాక్‌కి గురయ్యాం. హింసాత్మక ప్రాంతాల్లో మహిళలను వస్తువులుగా ఉపయోగించుకున్నారు. దీనికి బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి"


మరోవైపు ప్రధాని మోదీ ఆగ్రహం


మణిపూర్‌లో అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన హింసాత్మక ఘటనలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ మహిళను నగ్నంగా రోడ్లపై తిప్పిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో చాలా ఆవేశంగా మాట్లాడారు మోదీ. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించమని తేల్చి చెప్పారు. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించమని తేల్చి చెప్పారు. మణిపూర్‌లో జరిగిన దారుణం...మొత్తం దేశానికే కళంకం అని అన్నారు. 


"మణిపూర్‌లో జరిగిన ఘటన దేశంలోని 140 కోట్ల ప్రజలందరికీ సిగ్గుచేటు. నిందితులను వదిలిపెట్టమని దేశ ప్రజలందరికీ మాట ఇస్తున్నాను. ఈ ఘటన గురించి తెలిసినప్పటి నుంచి నా గుండె మండుతోంది. మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా శాంతి భద్రతల్ని కాపాడడంపై దృష్టి పెట్టాలి. మణిపూర్‌లోని మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఎప్పటికీ క్షమించం"


- ప్రధాని నరేంద్ర మోదీ 
 






మైతాయ్ కమ్యూనిటీ సభ్యులే మహిళలను నగ్నంగా తీసుకెళ్తూ వీడియోలు తీశారని కుకీ తెగకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీఎల్‌ఎఫ్ ఆరోపిస్తోంది. ఈ విషయంపై జాతీయ మహిళా కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఐటీఎల్ఎఫ్ డిమాండ్ చేసింది.


మేలో గిరిజన తెగ మైతాయ్, పర్వతాలపై నివసిస్తున్న గిరిజన తెగ కుకి మధ్య ప్రారంభమైన హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నాయి. మెజారిటీగా ఉన్న మైతాయ్ షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా కోరుతూ లోయలో ఆందోళనలు ప్రారంభించారు. దీన్ని తిప్పికొట్టేందుకు కుకి గిరిజనుల సంఘాలు కూడా నిరసన తెలపడంతో హింస చెలరేగింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ భయంకరమైన ఘర్షణలో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది ప్రజలు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పారిపోయారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలోని హింస చెలరేగింది.