భారత రెజ్లర్ భజరంగ్ పూనియా ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు చేరుకున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్యపై కొనసాగుతున్న వివాదంలో క్రీడాకారుల డిమాండ్‌లను మంత్రి ముందు ఉంచారు. ప్రభుత్వానికి, రెజ్లర్లకు మధ్య ఛాంపియన్ రెజ్లర్ బబితా ఫోగట్ మధ్యవర్తిత్వం వహించనున్నారు. రెజ్లర్ల డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయనున్నారు. బబిత గురువారం ఉదయం జంతర్ మంతర్ కు చేరుకున్నారు. రెజ్లర్ల ప్రతి సమస్యను ప్రభుత్వానికి తెలియజేస్తామని వారు చెబుతున్నారు. కొత్త రెజ్లింగ్ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు.
జంతర్ మంతర్ వద్ద బైఠాయించిన భజరంగ్ పూనియా సహా పలువురు రెజ్లర్లు క్రీడా మంత్రిత్వ శాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తన డిమాండ్‌లను కేంద్రం ముందు ఉంచారు. ప్రస్తుతం ఉన్న రెజ్లింగ్ ఫెడరేషన్ రద్దు చేసి కొత్త ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని రెజ్లర్లు అంటున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ మొత్తం అవినీతిపరులతో నిండిపోయిందని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. అందువల్ల దీనిని పూర్తిగా తొలగించడం అవసరమని గట్టిగా చెబుతున్నారు. క్రీడా మంత్రిత్వ శాఖకు వెళ్లే ముందు అధికారులతో మాట్లాడిన తర్వాత మరింత సమాచారం ఇస్తానని భజరంగ్ చెప్పాడు.
కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత గీతా ఫోగట్, ఆమె సోదరి బబిత కూడా వినేష్, భజరంగ్‌కు మద్దతుగా నిలిచారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు భజరంగ్, సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్ తదితరులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు.
ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత వినేశ్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తనను మానసికంగా వేధిస్తున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించానని చెప్పారు. ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా సహా 30 మందికిపైగా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు.
వాళ్లెవరూ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించలేరు: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ రెజ్లింగ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారు 22 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్కులే. సమ్మెలో ఉన్న అథ్లెట్లు ఎవరూ ఒలింపిక్స్ లో పతకం సాధించలేరు. ఈ కారణంతోనే వాళ్లంతా ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆందోళన సంగతి తెలుసుకున్న వెంటనే ఫ్లైట్‌లో ఢిల్లీ వచ్చారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. వినేశ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణ చాలా పెద్ద ఆరోపణ. నేను లేదా ఫెడరేషన్ ఒక అథ్లెట్ ను వేధించానని ఎవరైనా నా ముందు చెప్పగలరా? అని సవాల్ చేశారు.
కొత్త నిబంధనలే కారణమా?
గత పదేళ్లుగా ఫెడరేషన్ తో తనకు ఎలాంటి సమస్య లేదని బ్రిజ్ భూషణ్ చెప్పారు. కొత్త నిబంధనలు తీసుకురావడంతో సమస్యలు తెరపైకి వచ్చాయన్నారు. నిరసన తెలుపుతున్న రెజ్లర్ల గురించి ఫెడరేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ, వారు ఒలింపిక్స్ తర్వాత ఏ జాతీయ టోర్నమెంట్లో పాల్గొనలేదని చెప్పారు.
ఆటగాళ్లను పరీక్షించే కొత్త నిబంధనలు వచ్చాయని బ్రిజ్ భూషణ్ శరణ్ చెప్పారు. ఈ పరీక్షలో విజేతగా నిలిచిన క్రీడాకారులు ఒలింపిక్ కోటాలో ప్రవేశించే ఆటగాడితో పోటీపడతారు. ఈ నిబంధనను తాను ఒక్కడినే తీసుకురాలేదని చెప్పారు. అంతర్జాతీయ పోటీలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారు. రెజ్లర్ల ఆరోపణల వెనుక ఓ పారిశ్రామికవేత్త హస్తం ఉందని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆరోపించారు.