మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రవేశపెట్టనున్న వేళ ఆర్థిక శాఖకు సంబంధించిన రహస్య సమాచారాన్ని లీక్ అవ్వడం కలకలం రేపుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇతర దేశాలకు లీక్ చేసినందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. నిందితుడిని సుమిత్‌గా గుర్తించినట్లు వారు తెలిపారు. నిందితుడు కాంట్రాక్టు ఉద్యోగి అని, ఆర్థిక మంత్రిత్వ శాఖలో 'డేటా ఎంట్రీ ఆపరేటర్'గా పని చేస్తున్నాడని చెప్పారు.


అధికారిక రహస్యాల చట్టం కింద నిందితుడు సుమిత్ పై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు దొడ్డి దారిలో డబ్బు సంపాదించడం కోసం ఇతర దేశాలకు రహస్య సమాచారాన్ని లీక్ చేశాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ‘‘మా విచారణలో, నిందితుడు ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పంచుకోవడానికి తన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నాము’’ అని అధికారి చెప్పారు.