BJP Nitin Gadkari: 



కాంగ్రెస్ లీడర్‌ని ప్రస్తావించిన గడ్కరీ..


కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేరాలంటూ ఆ పార్టీ నేత ఇచ్చిన ఆఫర్‌ని తిరస్కరిస్తూ సెటైర్లు వేశారు. గతంలో దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కర్‌ నితిన్ గడ్కరీకి కాంగ్రెస్‌లోకి వెల్‌కమ్ చెప్పారు. దీని గురించి ప్రస్తావిస్తూ "కాంగ్రెస్ పార్టీలో చేరే బదులు బావిలో దూకుతానని చెప్పాను" అని సమాధానమిచ్చినట్టు వెల్లడించారు గడ్కరీ. మహారాష్ట్రలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ కామెంట్స్ చేశారు. మోదీ సర్కార్‌కి 9 ఏళ్ల పూర్తైన సందర్భంగా కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమయంలోనే బీజేపీ చరిత్రను ప్రస్తావించిన ఆయన అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీలో చేరిన తొలినాళ్లలో తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పారు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ నేత ఆఫర్ గురించి చెప్పారు. 


"అప్పట్లో కాంగ్రెస్ నేత జిక్చర్ నాకో సలహా ఇచ్చారు. నువ్వు గొప్ప లీడర్‌వి. పార్టీ కోసం కష్టపడే తత్త్వం కూడా ఉంది. నువ్వు కాంగ్రెస్‌లో చేరితే చాలా మంచి భవిష్యత్ ఉంటుంది అన్నారు. అప్పుడు నేనొకటే సమాధానం చెప్పాను. బావిలో అయినా దూకుతాను కానీ కాంగ్రెస్‌లే చేరను అని బదులిచ్చాను. నాకు బీజేపీపై ఉన్న నమ్మకం అలాంటిది. ఈ పార్టీ సిద్ధాంతం ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది"


- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి 


మోదీ విజనరీ...


60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన దాని కన్నా రెట్టింపు పనులు కేవలం 9 ఏళ్లలో  తమ ప్రభుత్వం చేసిందని తేల్చి చెప్పారు నితిన్ గడ్కరీ. యువకుడిగా ఉన్నప్పుడు RSS కార్యకర్తగా పని చేశానని చెప్పిన ఆయన...ఆ సంస్థ విలువల పట్ల తనకెంతో గౌరవముందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఎన్నో సార్లు చీలిపోయిందని విమర్శించారు. 


"మన దేశ ప్రజాస్వామ్య చరిత్రను ఎప్పటికీ మర్చిపోవద్దు. గతం నుంచి నేర్చుకోవాలి. భవిష్యత్‌ను మలుచుకోవాలి. 60 ఏళ్లు కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలించింది. గరీబీ హఠావో నినాదం తీసుకొచ్చింది. కానీ..స్వప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ విజన్ వల్ల దేశం సూపర్‌ పవర్‌గా ఎదిగింది. భారత్‌ భవిష్యత్‌లో మరింత వెలిగిపోతుంది"


- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి 


ఇటీవల కొన్ని మీడియా సంస్థలూ ఆయన రిటైర్ అయ్యే అవకాశాలున్నాయంటూ ప్రచారం చేశాయి. గతంలో కొన్ని సార్లు కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసి ఆ తరవాత...వాటిపై వివరణ ఇచ్చారు గడ్కరీ. అప్పటి నుంచి అధిష్ఠానంతో గడ్కరీకి భేదాభిప్రాయాలున్నాయన్న వదంతులు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రాజకీయాలకే గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. దీనిపై స్వయంగా గడ్కరీయే క్లారిటీ ఇచ్చారు. కాస్త బాధ్యతగా నడుచుకోవాలంటూ మీడియాకు చురకలు కూడా అంటించారు. రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. ముంబయి గోవా నేషనల్ హైవే నిర్మాణ పనులను సమీక్షించిన గడ్కరీ..ఆ తరవాత ఈ వ్యాఖ్యలు చేశారు. 


"రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న ఆలోచన నాకు లేదు. ఈ విషయంలో కాస్త మీడియా బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుంది"


- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి


Also Read: Nehru Museum Renaming: నెహ్రూ మ్యూజియం పేరు మార్చిన బీజేపీ, భగ్గుమంటున్న కాంగ్రెస్