Cyclone Biparjoy: 


రాజస్థాన్‌లో ఎఫెక్ట్..


బిపార్‌జాయ్ తుపాను గుజరాత్‌ తీరాన్ని తాకి విధ్వంసం సృష్టించింది. అక్కడి నుంచి రాజస్థాన్‌ వైపు దూసుకొచ్చింది. జోధ్‌పూర్ వైపు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు IMD అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రెస్క్యూ టీమ్‌లు సిద్ధమయ్యాయి. త్వరలోనే ఈ తుపాను ప్రభావం తగ్గుముఖం పడుతుందని IMD చెబుతున్నప్పటికీ...ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే...ఈ తుపాను ఎఫెక్ట్‌ రాబోయే 12 గంటల్లో మరి కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలోనే ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. జూన్ 4వ తేదీన అరేబియా సముద్రంలో మొదలైన ఈ తుపాను...జూన్ 15వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు గుజరాత్‌లోని కచ్‌ని తాకింది. అప్పటి నుంచి శాటిలైట్ అనాలసిస్ చేస్తున్నారు అధికారులు. దీని ప్రకారం చూస్తే...జోధ్‌పూర్‌పై గట్టిగానే ప్రభావం పడేలా కనిపిస్తోంది. మరో 36 గంటల్లో బలహీనపడే అవకాశాలున్నాయి. అప్పటి వరకూ ఈదురు గాలులు వీస్తాయి. అంతే కాదు. 


ఆలస్యం..? 


పలు చోట్ల భారీ వర్షాలూ కురుస్తాయని IMD వివరిస్తోంది. రాజస్థాన్, హరియాణా, ఢిల్లీ, యూపీలో రాబోయే 12 గంటల్లో వానలు కురవనున్నాయి. ఈ తుపాను కారణంగా జూన్ మొదటి వారంలోనే కేరళలో వర్షాలు కురిశాయి. అయితే..అరేబియన్ సముద్రంలో తుపాను క్రమంగా తమిళనాడు మీదుగా బే ఆఫ్ బెంగాల్‌ వైపు దూసుకెళ్లే అవకాశముంది. అదే సమయంలో బంగ్లాదేశ్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలనూ తాకనుంది. హిమాలయ ప్రాంతాలపైనా ప్రభావం పడనుంది. బిహార్, యూపీ, మధ్యప్రదేశ్‌ సహా పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. ఆ తరవాత ఇది తెలుగు రాష్ట్రాల తీర ప్రాంతాలకూ చేరుకునే అవకాశముందని IMD అంచనా వేస్తోంది. అయితే...గతంతో పోల్చి చూసుకుంటే ఈసారి వానలు కాస్త ఆలస్యంగా కురిసే అవకాశాలున్నాయి. అంతే కాదు. వర్షపాతం తక్కువగానే నమోదవుతుందని IMD ప్రాథమికంగా తేల్చి చెబుతోంది. ఫలితంగా...పంట దిగుబడి తగ్గనుంది. మొత్తంగా...ఈ సారి రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. 


ఈదురు గాలులు, భారీ వర్షాలతో గుజరాత్‌ని అతలాకుతలం చేసింది ఈ తుపాను. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ధాటికి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా...23 మంది తీవ్రంగా గాయపడ్డారు. 


"గుజరాత్‌లో తుఫాను కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 23 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దాదాపు వెయ్యి గ్రామాల్లో కరెంట్‌ లేదు. తాగు నీరు కూడా అందుబాటులో లేదు. 800 చెట్లు నేల కూలిపోయాయి. ఒక్క రాజ్‌కోట్‌లో తప్ప అన్ని చోట్లా భారీ వర్షాలు కురుస్తున్నాయి"


- అతుల్ కర్వాల్, ఎన్‌డీఆర్‌ఎఫ్ డీజీ


కచ్‌లో నష్టం ఎక్కువగా వాటిల్లింది. రెండు హైవేస్‌ని మూసేశారు. గంటకు 115-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కొన్ని రైళ్లనూ రద్దు చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే ప్రకటించింది. కచ్‌లోని మాండ్వి, మోర్బిలోని మలియా ప్రాంతాల్లో చెట్లన్నీ కూలిపోతున్నాయి. కరెంట్ స్తంభాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ని రీస్టోర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


Also Read: Manipur Violence: మణిపూర్‌లో కాల్పుల మోత, అర్ధరాత్రి పలు చోట్ల విధ్వంసం - బీజేపీ ఆఫీస్‌పై దాడికి యత్నం