Women's Reservation Bill: 


రాష్ట్రాల మద్దతు లేకుండానే బిల్ పాస్..? 


మహిళా రిజర్వేషన్‌ బిల్‌ పార్లమెంట్‌లో భారీ మెజార్టీతో పాస్ అయితే...రాష్ట్రాల అంగీకారంతో సంబంధం లేకుండానే అమల్లోకి వస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం...సభలోని మూడింట రెండొంతుల మంది సభ్యులు ఓ బిల్‌కి మద్దతిస్తే అది పాస్ అవుతుంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్‌ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకూ బిల్ పాస్ అవ్వాలంటే కనీసం 50% రాష్ట్రాలు మద్దతునివ్వాల్సిందేనన్న వాదన వినిపించింది. కానీ...మహిళా రిజర్వేషన్ బిల్‌కి మాత్రం ఈ రూల్ వర్తించదు. అందుకు కారణం...ఈ బిల్‌ని తీసుకొచ్చిన విధానం. స్పెషల్ మెజార్టీ ఉంటే బిల్‌ పాస్ చేసేలా ముందస్తుగానే జాగ్రత్తపడ్డారు. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం...పార్లమెంట్‌లో రాష్ట్రాల ప్రాతినిధ్యంతో సంబంధం లేకుండానే మహిళా రిజర్వేషన్ బిల్‌కి ఆమోద ముద్ర వేసుకోవచ్చు. రాష్ట్రపతి ఎన్నికలతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్ర- రాష్ట్ర వ్యవహారాల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల ప్రాతినిధ్యం అవసరం. కానీ..మహిళా రిజర్వేషన్‌ లాంటి స్పెషల్ కేటగిరీ బిల్స్‌కి ఆ అవసరం ఉండదు. కేంద్ర ప్రభుత్వం Goods and Services Tax (GST) Billని తీసుకొచ్చిన సమయంలో పార్లమెంట్‌లో మెజార్టీతో పాటు రాష్ట్రాల ఆమోదమూ అవసరమైంది. రాష్ట్రాల ఆమోద ముద్రతో అమల్లోకి వచ్చిన చివరి బిల్ అదే. 


2029 నాటికే అమలు..! 


2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్‌ని రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బిల్‌ తీసుకొచ్చారు. 2010లో ఇది రాజ్యసభలో పాస్ అయినప్పటికీ..లోక్‌సభలో మాత్రం చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. కానీ...బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోద ముద్ర వేయించుకోవాలన్న పట్టుదలతో ఉంది. 2014,2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలనూ మహిళా రిజర్వేషన్ బిల్‌ హామీని ఇచ్చింది బీజేపీ. తమను గెలిపిస్తే కచ్చితంగా ఈ బిల్‌ ప్రవేశపెడతామని చెప్పింది. రెండో టర్మ్ ముగిసిపోయి మూడోసారి ఎన్నికలకు వెళ్తున్న ఈ కీలక సమయంలో ఆ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఈ బిల్‌ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్‌ చట్టంగా మారితే పార్లమెంట్ సహా రాష్ట్రాల అసెంబ్లీల్లో 33% మహిళలకే కోటా వర్తిస్తుంది. అయితే..2029 వరకూ ఇది అమల్లోకి వచ్చే అవకాశాలు తక్కువే అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ చట్టాన్ని అమలు చేయాలంటే ముందుగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి. ఈ ప్రక్రియ 2027లో జరిగే అవకాశముంది. ఆలోగా ఓ సారి జనగణన చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ ముగిసి పూర్తి స్థాయిలో అమల్లోకి రావాలంటే ఐదేళ్ల సమయం పట్టనుందన్నది కొందరి వాదన. 


సోనియా మద్దతు..


ఈ బిల్లులో ఓబీసీలను కూడా చేర్చాలని కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ డిమాండ్‌ చేశారు. 33 శాతం కోటాలో ఇతర వెనుక బడిన వర్గాల మహిళలను కూడా చేర్చాలని అన్నారు. ప్రతిపక్షం నుంచి తొలుతగా సోనియా మాట్లాడారు. ఈ బిల్లు పట్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామని, అలాగే కన్సర్నడ్‌ గా కూడా ఉన్నామని అన్నారు. భారత మహిళలు రాజకీయ అవకాశాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు ఇంకా మరికొన్ని సంవత్సరాలు ఎదురుచూడమని అడుగుతున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు? అని ప్రశ్నించారు. దీనిని వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. 


Also Read: బీజేపీ యుద్ధానికి ప్రతిపక్షాలే స్వయంగా అస్త్రాలు అందిస్తున్నాయా? కమల దళానికి అదే కలిసొస్తోందా?