మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఈరోజు లోక్‌సభలో చర్చ జరుగుతోంది. నిన్న నూతన పార్లమెంటు ప్రారంభమైన తర్వాత తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా దానిపై ఈరోజు చర్చ ప్రారంభమైంది. ఈ బిల్లులో ఓబీసీలను కూడా చేర్చాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. 33 శాతం కోటాలో ఇతర వెనుక బడిన వర్గాల మహిళలను కూడా చేర్చాలని అన్నారు. ప్రతిపక్షం నుంచి తొలుతగా సోనియా మాట్లాడారు. ఈ బిల్లు పట్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామని, అలాగే కన్సర్నడ్ గా కూడా ఉన్నామని అన్నారు. భారత మహిళలు రాజకీయ అవకాశాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు ఇంకా మరికొన్ని సంవత్సరాలు ఎదురుచూడమని అడుగుతున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు? అని ప్రశ్నించారు. దీనిని వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ బిల్లుకు తనకు ఎంతో ఎమోషనల్ అని, తన భర్త రాజీవ్ గాంధీ లోకల్ బాడీస్‌లో రిజర్వేషన్లు ప్రారంభించారని సోనియా గాంధీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ నారీ శక్తి వందన్ అభియాన్ 2023 బిల్లుకు మద్దతిస్తుందని స్పష్టంచేశారు. అయితే ఎస్పీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్ కోటా ద్వారా దీనిని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. దీని అమలులో ఆలస్యం చేయడం భారత మహిళలకు అన్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న ఈ బిల్లుకు మోక్షం లభించినట్లైంది. అయితే ఇందులో OBC మహిళలకు రిజర్వేషన్ల అంశం వివాదాస్పదం, చర్చకు దారితీస్తోంది. మహిళలకు 33% సీట్ల రిజర్వేషన్ల అంశం గతంలో పార్లమెంట్ లోపల, వెలుపల అనేక ఆవేశ పూరిత చర్చలకు కారణమైంది. 1996 మహిళా రిజర్వేషన్ బిల్లును పరిశీలించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదిక OBCలకు రిజర్వేషన్‌ను కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని, వారికి రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. రాజ్యసభ, శాసనమండలిలకు కూడా రిజర్వేషన్లు పొడిగించాలని సిఫారసు చేసింది. ఈ సిఫార్సులు ఏవీ 2010 బిల్లు, తాజా బిల్లులో పొందుపరచబడలేదు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో OBC లకు రిజర్వేషన్ కల్పించలేదు.
1996 రిజర్వేషన్ బిల్లును పరిశీలించిన గీతా ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్ల ప్రయోజనాన్ని వర్తింపజేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని సిఫారసు చేసింది. అయితే అప్పటి ప్రభుత్వం OBC మహిళలకు సీట్ల రిజర్వేషన్లు కల్పించడంపై బిల్లులో పొందుపరకపోవడాన్ని ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ గమనిచింది. రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఉన్నందున వారికి OBCలకు రిజర్వేషన్లు లేకుండా పోయాయి.
ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా నివేదిక నమోదు చేసింది. ఉదాహరణకు, రాష్ట్రీయ జనతా దళ్ తన రాతపూర్వక మెమోరాండమ్‌లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో, ముస్లింలు, క్రైస్తవులు, ఇతరులతో సహా OBC, మైనారిటీలు, దళితులు (SC/ST) కోటా తప్పనిసరిగా ఉండాలని. జనాభా లెక్కల ప్రకారం ఈ వర్గాల మహిళలకు కోటాలో తప్పనిసరిగా కల్పించాలని పేర్కొంది. అలాగే సమాజ్ వాదీ పార్టీ సైతం మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే అందులో ఓబీసీ, ముస్లిం మహిళలకు కోటా ఉండాలని స్పష్టం చేసింది.