Will petrol and diesel come under GST | న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్‌ ను గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) పరిధిలోకి తీసుకొస్తారా అని అంతా ఎదురూచూస్తున్నారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ 53వ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) స్పందించారు. పెట్రోల్, డీజిల్ ఇంకా జీఎస్టీ కింద లేవని, కానీ వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. అయితే పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలా, వద్దా అనేది రాష్ట్రాల నిర్ణయంపై ఆధారపడి ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


కేంద్రానికి ఓకే, తుది నిర్ణయం రాష్ట్రాలదే 
పెట్రోల్, డీజిల్ లపై జీఎస్టీ లేదు కానీ, ఏటీఎఫ్‌తో పాటు, వ్యాట్, సెంట్రల్ సేల్స్ టాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటాయన్నారు. ‘జీఎస్టీ తెచ్చిన సమయంలో అప్పటి ఆర్థిక మంత్రి దీనిపై అంతగా ఆలోచించలేదు. కానీ ఇవి జీఎస్టీ పరిధిలో బెటర్ అని భావించేవారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇదే ఆలోచనతో ఉంది. అయితే పెట్రోల్, డీజిల్ జీఎస్టీలోకి తేవాలా, వద్దా అనే విషయంపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదే. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయని’ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనంతరం నిర్మలా సీతారామన్ ఈ విషయాలు షేర్ చేసుకున్నారు.


జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్ లను తీసుకురావాలనే డిమాండ్ చాలా కాలం నుంచే ఉంది. జీఎస్టీలో గరిష్టం అయిన 28 శాతం పన్ను పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ఇంధనాలను తీసుకొస్తే ప్రజలకు ధరల నుంచి ఊరట కలుగుతుంది. పలు రకాల పన్నులకు బదులుగా కేవలం జీఎస్టీ విధించినట్లయితే ఈ ఇంధనాల ధరలు దిగిరానున్నాయి. దాంతో ఖర్చులు తగ్గి, వాహనదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. పరోక్షంగా పెట్రోల్, డీజిల్ లపై ఆధారపడి పెరుగుతున్న నిత్యావసర సరుకులు, ఇతర ఉత్పత్తుల ధరలు దిగొస్తాయి. ప్రజలకు ధరల భారం తగ్గుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం జీఎస్టీ పరిధిలోకి వీటిని తేవడానికి అంగీకరించడం లేదు.


రాష్ట్రాలకు మంచి ఆదాయ వనరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం అందించే వనరుల్లో  పెట్రోలియం ఉత్పత్తులు ఒకటి. రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రోలియం ఉత్పత్తుల నుంచి భారీ ఆదాయం లభిస్తుంది. పలు రాష్ట్రాల ఆదాయంలో పెట్రోల్, డీజిల్ నుంచి వచ్చేవి 10 నుంచి గరిష్టంగా 17 శాతం వరకు లభిస్తోంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు అందుకే  ఆసక్తి చూపించవు. పెట్రోల్, డీజిల్ పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దేశంలో అత్యధిక వ్యాట్ విధిస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా 35 శాతం వ్యాట్‌ తెలంగాణలో వసూలు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 31 శాతం VAT వసూలు చేస్తున్నారు.