Salary Deduction: ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు సమయానికి రావటం చాలా అరుదు. చాలా తక్కువ మంది మాత్రమే సమయ వేళలను సరిగా పాటిస్తుంటారని మనందరికీ తెలిసిందే. అయితే ఈ అలసత్వానికి చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ 3.0లో ముందడుగు వేసింది. తాజాగా దీనికి సంబంధించి విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ కలిగిస్తున్నాయి.


ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఆలస్యంగా రావటం మామూలైన విషయమే. చాలా సార్లు ముఖ్యమైన పనులపై అధికారులను కలిసేందుకు వచ్చే చాలా మంది సామాన్యులు వారి రాక కోసం పడిగాపులు కాయాల్సిన పస్థితులు సైతం చాలా సార్లు ఉంటుంటాయి. అయితే కార్యాలయాలకు ఇలా ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రంలో మూడోసారి మోదీ సర్కార్ కొలువుతీరిన తర్వాత ఉద్యోగుల సమయపాలనకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను తాజాగా జారీ చేసింది. వీటి ప్రకారం ఇకపై ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తమ కార్యాలయానికి 15 నిమిషాల కంటే ఆలస్యంగా వస్తే జీతంలో కోత తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా షాక్ కి గురైన ఉద్యోగులు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


ఉద్యోగుల సమయ పాలనపై తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ప్రభుత్వ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. వీటి ప్రకారం ఇకపై ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తాను పనిచేస్తున్న కార్యాలయానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే ఆలస్యంగా వచ్చేందుకు అవకాశం కల్పించబడిందని స్పష్టం చేసింది. ఉద్యోగుల ఆఫీసు వేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంటాయి, ఇందులో 15 నిమిషాలు ఆలస్యం అంటే ఉదయం 9.15 గంటల వరకు మాత్రమే ఎలాంటి చర్యలు లేకుండా ఉద్యోగి హాజరును పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. అలాగే 9.15 గంటల తర్వాత ఆఫీసుకు హాజరయ్యే ప్రతి ఒక్కరికి వారి జీతంలో సగం రోజు సెలవుగా పరిగణించి హాఫ్ డే శాలరీ తగ్గించబడుతుందని వెల్లడించింది. అయితే ఈ ఆర్డర్ సీనియర్ అధికారులతో సహా ఉద్యోగులందరికీ వర్తిస్తుదని తాజా సర్య్కులర్ లో వెల్లడించటం జరిగింది. 


కరోనా మహమ్మారి నుంచి దేశంలోని అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను ఉపయోగించడం మానేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్నందున హాజరు కోసం బయోమెట్రిక్‌ను ఉపయోగించడం కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అందువల్ల ఇకపై ఉదయం 9:15 గంటలలోపు రాని ఉద్యోగులకు హాఫ్-డే క్యాజువల్ లీవ్ కింద పరిగణించి ఆ కాలానికి వర్తించే జీతం తగ్గించబడుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ పేర్కొంది. 


తాజా మార్గదర్శకాల ప్రకారం ఎవరైనా ఉద్యోగి ఏదైనా నిర్దిష్ట రోజున సమయానికి కార్యాలయానికి చేరుకోలేకపోతే, వారు తమ సీనియర్ అధికారికి ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే సాధారణ సెలవు కోసం దరఖాస్తు చేసుకోవాలి. తమ సిబ్బంది సమయపాలన పాటించాలని, వారి హాజరును నిశితంగా పర్యవేక్షించాలని డీఓపీటీ అధికారులను కూడా ఆదేశించింది.


ముఖ్యంగా జూనియర్ స్థాయి ఉద్యోగులు ఆఫీసులకు లేటుగా వచ్చి సమయాని కంటే ముందే వెళ్లిపోతుంటారు. వీటిపై సీనియర్లు చాలా సార్లు ఫిర్యాదులు సైతం చేసేవారు. ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రభుత్వ కార్యాలయాలకు సైతం నిర్ణీయ పనివేళలు ఏర్పాటుకు 2014లో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే దీనిపై ఉద్యోగులు అప్పట్లో నిరసనలు చేయటంతో ఆ ప్లాన్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. అయితే ప్రస్తుతం మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి రావటంతో ఉద్యోగుల్లో క్రమశిక్షణను పెంచటంతో పాటు సామాన్య ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉండేలా చూసేందుకు ప్రయత్నంలో భాగంగా సమయపాలనపై కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టిందని తెలుస్తోంది.