Mukesh Ambani deepfake video: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ని ఉపయోగించి పనులు క్షణాల్లో చేసేయొచ్చు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ దీన్నే ఉపయోగించి మోసాలూ సులువుగా చేసేయొచ్చు.  మొదటి పాఠం కంటే రెండో పాఠమే బాగా వంటపట్టించుకున్న కేటుగాళ్లు వారి చోరకళకు టెక్నాలజీని జతచేశారు. 


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి  డీప్ ఫేక్ సాయంతో అనేక ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం,  కొందరు హీరోయిన్లు  తమ మొఖాలతో ఉన్న వీటిని చూసి అఫెన్సివ్‌గా ఫీలయ్యి పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడం ఇప్పుటి వరకూ చూశాం. ఇక ఇప్పుడు ఈ డీప్ ఫేక్ వీడియోలతో మార్కెటింగ్ మొదలెట్టారు నయవంచకులు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ వీడియోను క్రియేట్ చేసి దాని సాయంతో మోసాలకు తెగబడుతున్నారు. 


స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటూ ముఖేష్ అంబానీ చెప్పినట్లు, ఈ పెట్టుబడికి ఆయన సూచనలు, సలహాలు ఇచ్చినట్లూ  డీప్ ఫేక్ వీడియో ఒకటి తయారు చేశారు కేటుగాళ్లు.  మోసం చేయాలని అనుకుందే తడవుగా దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు.  ఆ వీడియో నిజం అనుకుని.. ముంబైకి చెందిన ఓ డాక్టర్.. 7 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. చివరికి అదంతా మోసమని తేలడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. 


అంబానీ అంతటివాడు చెబితే ఊరుకుంటామా? 


ముంబైలోని అంధేరీకి చెందిన 54 ఏళ్ల డా. KH పాటిల్ సైబర్ మోసానికి గురయ్యారు.  తన ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో డీప్‌ఫేక్ వీడియో ఒకటి చూశారు పాటిల్. ఈ వీడియోలో  ముకేశ్ అంబానీ రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్‌కి చెందిన  BCF అకాడమీలో పెట్టుబడి పెట్టడం ద్వారా  అధిక రాబడిని వస్తుందని చెప్పడం కనిపించింది. సదరు సంస్థను ప్రొమోట్ చేయడమే కాకుండా పెట్టుబడి ఎలా పెట్టాలి, రాబడి ఎలా వస్తుంది అనే అంశాలపై పూర్తి సెమినార్ కూడా తీసుకున్నారు.  ఇదంతా పాటిల్ నిజమని నమ్మారు.  అపర కుబేరుడు అంబానీ చెప్తున్నాడంటే విషయం ఉండే ఉంటుందని ఆన్లైన్లో దాని గురించి బాగా అధ్యయయం చేశారు.


బ్యాగ్రౌండ్ బాగానే సెట్ చేశారు.. 


లండన్‌లో, ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో సదరు సంస్థ కార్యాలయాలున్నాయని ఆన్లైన్ సెర్చ్ ద్వారా ఓ అవగాహనకొచ్చారు. ఇంత ఖరీదైన చోట్ల ఆఫీసులున్నాయి కాబట్టీ తమ పెట్టుబడి ఎక్కడికీ పోయే అవకాశమే లేదని ఫిక్సయిపోయారు. పెట్టుబడి పెట్టకుండా ఉండేందుకు పాటిల్ కు ఏ కారణాలూ కనిపించలేదు. అంత బలంగా నమ్మించేలా బ్యాగ్రౌండ్ సెట్ చేశారు సైబర్ మోసగాళ్లు.  


ఏడు లక్షలకు రూ. 30 లక్షలొస్తే ఎగిరి గంతేసి.. 


దీంతో మే28 నుంచి జూన్ 10 వ తేదీ వరకు 16 వేరు వేరు ఖాతాల్లోకి డబ్బు వేసిన డా. పాటిల్.. దాదాపు  రూ. 7.1 లక్షలు సదరు సంస్థలో పెట్టుబడులు పెట్టారు. రూ. 30 లక్షలు లాభం వచ్చినట్టు యాప్ లో చూపించగా ఉబ్బి తబ్బిబ్బయ్యారు.  వెంటనే ఆ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించారు.  ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బు విత్ డ్రా కాకపోవడంతో తాను మోసపోయానని గుర్తించిన పాటిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రాన్స్‌ఫర్ అయిన మొత్తాన్ని బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 


కొంత కామన్ సెన్స్ ఉపయోగిస్తే.. 


అంబానీకి సంబంధించి ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు రావడం ఇది రెండోసారి. గతంలె కూడా ఓ ఫేక్ స్టాక్స్ కంపెనీకి సపోర్ట్ చేస్తూ తయారు చేసిన ఓ డీప్ ఫేక్ వీడియోపై కంప్లయింట్లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అంబానీ తో పాటు పలువురు ప్రముఖులతో ఇలాగే డీప్ ఫేక్ వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలిస్తూ మోస పూరిత మార్కెటింగ్‌కి పాల్పడే వారు ఇటీవల చాలా మంది తయారయ్యారని వారు చెబుతున్నారు.  విషయం తమ దాకా వచ్చే వరకే చాలా నష్టం జరిగిపోతోంది కనుక ఇలాంటివి  ఎవరూ నమ్మొద్దని సూచించారు.  ఇలాంటివి కళ్లకు కనిపించినపుడు కొద్దిగైనా కామన్ సెన్స్ తో ఆలోచిస్తే సులువుగా వీటి నుంచి బయటడొచ్చని చెప్పారు. అంబానీ స్థాయి వ్యక్తి పెట్టుబడులు పెట్టమంటూ సామాజిక మాధ్యమాల్లో ఎందుకు చెప్తారన్న సందేహం రావటం చాలా అవసరమని పేర్కొన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయంటూ చెప్పే ఏ యాడ్ నైనా అంత త్వరగా నమ్మడం సరికాదని స్పష్టం చేశారు.