SC Status For Converted Dalits: మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు షెడ్యూల్డ్ కుల హోదా ఇవ్వడాన్ని ఈ కమిషన్ పరిశీలిస్తుంది. తర్వాత ప్రభుత్వానికి ఓ నివేదిస్తుంది.


రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రవీందర్ కుమార్ జైన్, యూజీసీ సభ్యురాలు ప్రొఫెసర్ సుష్మా యాదవ్ కూడా సభ్యులుగా ఉంటారని కేంద్ర మంత్రిత్వ శాఖ గురువారం జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. కమిషన్ తన నివేదికను రెండేళ్లలో మంత్రిత్వ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది.


ఆర్టికల్ 341 అంటే ఏమిటి?


హిందూ, సిక్కు, బౌద్ధమతాలు కాకుండా వేరే మతాన్ని అవలంబించే ఏ వ్యక్తిని కూడా షెడ్యూల్డ్ కులంలో సభ్యుడిగా పరిగణించరాదని రాజ్యాంగం పేర్కొంది. మొదట హిందువులను మాత్రమే వర్గీకరించింది, కాని తరువాత సిక్కులు, బౌద్ధులను కూడా ఇందులో చేర్చారు. 1990లో ప్రభుత్వం ఈ ఉత్తర్వు సవరించి "హిందూ, సిక్కు, బౌద్ధమతం కాకుండా వేరే మతాన్ని విశ్వసించే ఏ వ్యక్తి అయినా షెడ్యూల్డ్ కులంలో సభ్యుడిగా పరిగణలోకి తీసుకోమని " అని తెలిపారు.


భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 షెడ్యూల్డ్ కులాలు గురించి చెబుతోంది. ఈ ఆర్టికల్‌లో రెండు క్లాజులు ఉన్నాయి. మొదటి క్లాజు ప్రకారం భారత రాష్ట్రపతి పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఏదైనా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ఏ కులాన్ని అయినా ఎస్సీలో చేర్చవచ్చు. రాష్ట్రం విషయంలో రాష్ట్రపతి అక్కడి గవర్నర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. రెండో క్లాజు ప్రకారం షెడ్యూల్డు కులాలలో చేర్చిన ఏ కులాన్నైనా రాష్ట్రపతి పబ్లిక్ నోటీస్ ద్వారా భారత పార్లమెంటు ఈ జాబితా నుంచి తొలగించడం లేదా చేర్చడం చేయవచ్చు. 


వివాదం ఎందుకు?


2020 నుంచి ఎస్సీ హోదా కోసం పోరాడుతున్న నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ (ఎన్సీడీసీ) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో ఈ కొత్త కమిషన్‌ ఏర్పాటు చేశారు. 2004 నుంచి ఈ కేసులో పలు కేసులు కోర్టులో దాఖలయ్యాయి. ఈ అంశంపై తన వైఖరి చెప్పాలని సుప్రీంకోర్టు ఆగస్టులో కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై స్పందిస్తున్న దళిత క్రైస్తవ, ముస్లిం సంస్థలు గుర్తింపు లేకపోవడం వల్ల ఆయా వర్గాలు వివక్ష ఎదుర్కొంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. గురువారం కేంద్రం విడుదల ఏర్పాటు చేసిన కమిషన్‌పై కూడా వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తాజా చర్య "ఆలస్యం చేసే వ్యూహంగా విమర్శిస్తున్నాయి. 


కేంద్రం ఏం చెబుతున్నారు?


షెడ్యూల్డ్ కులాల జాబితాలో కొత్తకులాలను చేర్చడంపై ఇప్పుడున్న కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని.... అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకే కమిషన వేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. "ఇది సంక్లిష్టమైన సామాజిక, రాజ్యాంగ సమస్య అని, ప్రజా ప్రాముఖ్యత కలిగిన విషయంగా అభివర్ణించింది. దాని ప్రాముఖ్యత, సున్నితత్త్వం దృష్ట్యా ఈ విషయంలో తీసుకునే నిర్ణయం కచ్చితమైన అధ్యయనం అందరి సంప్రదింపులపై ఆధారపడి ఉండాలి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952 ప్రకారం, ఇప్పటివరకు ఏ కమిషన్ కూడా ఈ విషయాన్ని పరిశోధించలేదు అని వివరించింది. 


ఎన్.సి.డి.సి నిరసనలు


ఈ చర్యను వ్యతిరేకిస్తున్న ఎన్సిడిసి (నేషనల్ కౌన్సిల్ ఫర్ దళిత్ క్రిస్టియన్స్) చైర్మన్ విజయ్ జార్జ్ మాట్లాడుతూ " విషయాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం, ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇష్ట పడటం లేదు. రంగనాథ్ మిశ్రా కమిషన్‌తో సహా గతంలో పలు కమిషన్లు, కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. అలాంటి సమయంలో మరో కమిషన్ అవసరం ఏమిటి? బౌద్ధులకు, సిక్కులకు షెడ్యూల్డు కుల హోదా ఇచ్చినప్పుడు కమిషన్ ఉండేది కాదు. ఈ చర్య రాజకీయ ప్రేరేపితమైంది అని ఆరోపించారు. 


రాజకీయా నాయకుల ఆరోపణలు


ఎన్సీడీసీ అభిప్రాయాన్ని సమర్థించారు ఆల్ ఇండియా పస్మాండా ముస్లిం మహాజ్ వ్యవస్థాపకుడు, బీహార్‌కు చెందిన మాజీ రాజ్యసభ ఎంపీ అలీ అన్వర్ అన్సారీ. 2024 ఎన్నికల్లో సెఫ్‌ గేమ్ ఆడేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఆలస్యం చేసిందని ఆరోపించారాయన. 


నేషనల్ దళిత్ క్రిస్టియన్ వాచ్ గవర్నింగ్ బోర్డ్ సభ్యుడు రిచర్డ్ దేవదాస్ మాట్లాడుతూ క్రైస్తవ మతం, ఇస్లాం మతంలోకి మారిన దళితులు ఇప్పటికీ వివక్ష ఎదుర్కొంటున్నారని అన్నారు. 'మమ్మల్ని దళితులుగా పరిగణిస్తూ, అస్పృశ్యతను ఎదుర్కొంటున్నా, రిజర్వేషన్ల ప్రయోజనాలు మాకు లభించడం లేదు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రక్షణ లేదు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ద్వారా రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. 


న్యూ స్టడీస్‌ డాటా లేకుండా ఎస్సీ జాబితాలో కొత్త కులాలను చేర్చడం సాధ్యం కాదని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ విజయ్ సంప్లా అన్నారు. "ఈ వర్గాల రిజర్వేషన్ ప్రమాణాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. వారు నిజంగా వివక్ష  ఎదుర్కొంటున్నారా లేదా అని ధృవీకరించాల్సిన అవసరం ఉంది." అన్నారు. 


 గత ప్రభుత్వం ఏం చేసింది


డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అప్పటి యుపిఎ ప్రభుత్వం అక్టోబర్ 2004లో ఈ దిశగా ఒక అడుగు వేసింది. మత, భాషా అల్పసంఖ్యాక వర్గాల సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ ఏర్పాటు చేసింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రా అధ్యక్షతన నేషనల్ కమిషన్ ఫర్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఏర్పాటైంది.


మే 2007 లో రంగనాథ్ మిశ్రా కమిషన్ తన నివేదికను సమర్పించింది. షెడ్యూల్డ్ కులాల హోదాను మతం నుంచి పూర్తిగా విడదీయాలని, ఎస్టీల మాదిరిగా చేయాలని సిఫార్సు చేసింది. అయితే క్షేత్రస్థాయి అధ్యయనాలు ద్వారా ఇది ధృవీకరించలేదనే కారణంతో అప్పటి ప్రభుత్వం ఈ సిఫారసును అంగీకరించలేదు.