Hardeep Singh Puri on Oil Imports: 


డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని..


దేశీయ అవసరాల కోసం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది భారత్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్‌ చమురు దిగుమతుల్ని కొనసాగిస్తుందా లేదా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యా నుంచి చమురు తీసుకోకపోవచ్చనీ అందరూ విశ్లేషించారు. కానీ..భారత్ ఇందుకు భిన్నంగా అక్కడి నుంచి దిగుమతి చేసుకుంది. దీనిపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రం ఎప్పుడూ నేరుగా దీనిపై స్పందించలేదు. దేశీయంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని పలు సందర్భాల్లో పరోక్షంగా చెప్పింది. ఇప్పుడు దీనిపై కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పందించారు. "దేశ ప్రజలకు విద్యుత్‌ని, ఇంధనాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందుకే...చమురు ఎక్కడి నుంచై కొనుగోలు చేయక తప్పదు. భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకోకూడదని ఇప్పటి వరకూ ఏ దేశమూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు" అని వెల్లడించారు. "ప్రజల కోసం భారత్ ఎక్కడి నుంచైనా చమురు దిగుమతి చేసుకుంటుంది. ఇక దీనిపైనా చర్చలు పెట్టడం అనవసరం" అని స్పష్టం చేశారు. వాషింగ్టన్‌లో రిపోర్టర్స్‌తోమాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు హర్‌దీప్ సింగ్ పురి. "మీ విధానం పట్ల పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు, ప్రజలకు అంతరాయం లేకుండా చూడాలనుకున్నప్పుడు, ఇంధన భద్రతను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకోవాలి" అని చెప్పారు. యూఎస్ ఎనర్జీ సెక్రటరీ జెన్నిఫర్ గ్రాన్‌హోమ్‌తో భేటీ తరవాత ఈ కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి. 






అది వాళ్ల ఇష్టం..


ఇటీవల ఒపెక్ సంచలన నిర్ణయం తీసుకుంది. రోజుకు 20 లక్షల బ్యారెళ్ల ఇంధన ఉత్పత్తిని నిలిపివేయనుంది. దీనిపైనా కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ స్పందించారు. "భారత్ ఒపెక్‌లో లేదు. ఒపెక్ తీసుకునే నిర్ణయాలను గమనించటం తప్ప ఏం చేయలేం. ఇంధన ఉత్పత్తి విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు వాళ్లకుంది. ఎంత మార్కెట్‌లోకి తీసుకురావాలనేది కూడా వాళ్ల ఇష్టమే" అని అన్నారు. 


Also Read: Air Force Day : 90 ఏళ్ల ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కు అవే పంచ ప్రాణాలు


Also Read: RSS Chief Mohan Bhagwat: కులవ్యవస్థకు కాలం చెల్లింది, మన ముందు తరాలు చాలా తప్పులు చేశాయి - మోహన్ భగవత్