RSS Chief Mohan Bhagwat: 


గతం మర్చిపోదాం..


సమాజంలో నుంచి వర్ణం, జాతి అనే కాన్సెప్ట్‌లను నిర్మూలించాలని అన్నారు RSS చీఫ్ మోహన్ భగవత్. నాగ్‌పూర్‌లో ఓ బుక్‌ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న భగవత్...ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సమాజానికి కులవ్యవస్థతో పని లేదని తేల్చిచెప్పారు. "వజ్రసుచి టంక్" అనే పుస్తకం గురించి మాట్లాడుతూ....సమానత్వం అనేది భారత సంస్కృతిలో భాగమని, కానీ...దాన్ని మర్చిపోయామని అన్నారు. ఈ కారణంగానే కొన్ని దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. "వర్ణం, జాతి" అనే వ్యవస్థల ఉద్దేశం వివక్ష కాదని, సదుద్దేశంతోనే వాటిని ప్రవేశపెట్టారన్న చర్చపైనా ఆయన స్పందించారు. "ఇలాంటి ప్రశ్నలెవరైనా నన్ను అడిగితే...అదంతా గతం. దాన్ని మర్చిపోయాం ముందుకెళ్లిపోదామని బదులిస్తాను" అని వెల్లడించారు భగవత్. "సమాజంలో వివక్షకు కారణమయ్యేది ఏదైనా మనం వాటిని వదిలే యాల్సిందే" అని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మన ముందు తరాలు చాలా తప్పులు చేశాయనీ, అందుకు భారత్‌ కూడా అతీతమేమీ కాదని అన్నారు. ఇది తప్పకుండా మనమంతా ఒప్పుకోవాలని చెప్పారు. మన ముందు తరాల వాళ్లు తప్పులు చేశారని అంటే..వాళ్లు బాధ పడతారనే ఆలోచనను తీసేయాలని, అన్ని చోట్లా ఇలాంటి తప్పులు జరిగాయన్న విషయాన్ని వాళ్లకు వివరించాలని సూచించారు. దేశంలో మైనార్టీలు ఆందోళనకు గురవుతున్నారన్న చర్చపైనా భగవత్ స్పందించారు. "అలాంటిదేమీ లేదు. మైనార్టీలకు ముప్పు ఉందన్నది సరి కాదు. హిందుత్వ సంస్థలు వాళ్లతో నేరుగా మాట్లాడి వాళ్ల భయాలు పోగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి" అని స్పష్టం చేశారు. 


ఆహారపు అలవాట్లపైనా వ్యాఖ్యలు..


ఆహారపు అలవాట్లపైనా ఇటీవల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)చీఫ్ మోహన్ భగవత్ ఆహారపు అలవాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. "తప్పుడు ఆహారం తీసుకుంటే తప్పుడు ఆలోచనలే వస్తాయి" అని వ్యాఖ్యానించారు. మాంసాహారం తీసుకునే వాళ్ల గురించి ఇలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు భగవత్. హింసతో కూడుకున్న ఆహారాన్ని తీసుకోవటం మంచిది కాదని హితవు పలికారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థైన భారత్ వికాస్ మార్చ్ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన భగవత్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ గురించి ప్రస్తావిస్తూ.. ఈ కామెంట్స్ చేశారు. "తప్పుడు ఆహారం తింటే తప్పుడు మార్గంలోనే వెళ్తాం. తామసాన్ని కలిగించే ఆహారాన్ని తినకపోవటమే మంచిది. విపరీతమైన హింసతో కూడుకున్న ఆహారం తినకూడదు" అని అన్నారు. ఇక్కడ తామసంతో కూడుకున్న ఆహారం అంటే మాంసం అనే అర్థమే వస్తుంది. పాశ్చాత్య దేశాల్లో, భారత్‌లో మాంసాహారులను పోల్చుతూ మరి కొన్ని కామెంట్స్ చేశారు. "భారత్‌లోనూ కొందరు మాంసాహారం తింటారు. కానీ...పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో మాంసాహారం తీసుకునే వాళ్లు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. శ్రావణ మాసంలో కొందరు మాంసం తినకుండా నిష్ఠగా ఉంటారు. కొందరు సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం..ఇలా కొన్ని రోజుల్లో మాంసం ముట్టుకోరు. తమకు తాముగా ఈ నియమాలు పెట్టుకుంటారు" అని భగవత్ చెప్పారు. 


Also Read: Mukesh Ambani Family Office: విదేశాలకు మకాం మార్చేస్తున్న ముఖేష్‌ అంబానీ!