రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొద్ది రోజుల క్రితమే పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన వారు లేక వారు చేసిన విశిష్ట సేవలకు గానూ పలువురికి ఈ అత్యున్నత పురస్కారాలు దక్కాయి. పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీలో జరగ్గా.. ఈసారి అవార్డులు అందుకున్నవారిలో చాలా మంది దేశం దృష్టిని తమవైపునకు తిప్పుకున్నారు. వీరిలో నిరుపేద మహిళ, పండ్లు అమ్ముకొనే వ్యక్తి, ట్రాన్స్ జెండర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరు కాక మరో వ్యక్తికి పద్మశ్రీ అందింది. ఒకప్పుడు పాకిస్థానీ సైనికుడైన ఆయనకు పద్మశ్రీ ఇవ్వడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్థాన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పని చేసి రిటైర్ అయిన ఖాజీ సజ్జాద్ అలీ జహీర్ ఈ పురస్కారం అందుకోవడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. 


ఈ పాకిస్తానీ సైనికుడి కథ చాలా ఆసక్తికరంగా, బాధతో కూడి ఉంది. లెఫ్టినెంట్ కల్నల్ జహీర్ 1971 లిబరేషన్ యుద్ధంలో భారతదేశం సాధించిన విజయానికి, అతని త్యాగాలకు గుర్తింపుగా ఇక్కడ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేశారు. 1971 విముక్త యుద్ధం జరిగి 50 సంవత్సరాలు జరిగిన సందర్భంగా లెఫ్టినెంట్ కల్నల్ జహీర్‌కు ఈ అవార్డును అందించారు. ఈ సంవత్సరం యాదృచ్ఛికంగా ఆయనకు 71 సంవత్సరాలు నిండడమే కాకుండా.. ఈ సంఖ్య బంగ్లాదేశ్ ప్రజలకు చాలా దగ్గరి సంఖ్య. ఎందుకంటే 1971లోనే బంగ్లాదేశ్‌కు పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం లభించింది.


లెఫ్టినెంట్ కల్నల్ జహీర్ పాకిస్థాన్‌లో గత 50 ఏళ్లుగా తన పేరు మీద ఉరిశిక్ష పెండింగ్‌లో ఉందని గర్వంగా చెప్పుకోవడం ద్వారా అతని శౌర్యాన్ని అర్థం చేసుకోవచ్చు.


లెఫ్టినెంట్ కల్నల్ జహీర్ ఎవరు?
20 సంవత్సరాల వయస్సులో లెఫ్టినెంట్ కల్నల్ జహీర్‌కు సియాల్‌కోట్ సెక్టర్‌లో పాకిస్తాన్ సైన్యంలో పోస్టింగ్ వచ్చింది. తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) విముక్తి తర్వాత, ఆయన బంగ్లాదేశ్ సైన్యం కోసం పని చేశారు. లెఫ్టినెంట్ కల్నల్ జహీర్ శౌర్యానికి గానూ ఆయనకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తగిన గౌరవాన్ని ఇచ్చింది. భారత్‌లో పరమవీర చక్రతో సమానంగా ఉండే బిర్ ప్రోటిక్ పురస్కారంతో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం జహీర్‌ను గౌరవించింది.


అంతేకాక, బంగ్లాదేశ్ అత్యున్నత పౌర గౌరవం స్వాధీనత పదక్ పురస్కారం కూడా జహీర్‌కు లభించింది. తాజాగా లెఫ్టినెంట్ కల్నల్ జహీర్ భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీని ప్రదానం చేశారు.


లెఫ్టినెంట్ కల్నల్ జహీర్ కథ
సియాల్‌కోట్ సెక్టార్‌లో పోస్ట్ చేయబడిన పాకిస్తాన్ ఆర్మీలో 20 ఏళ్ల యువ అధికారిగా మార్చి 1971లో ఆయన భారతదేశం వచ్చారు. పూర్వపు తూర్పు పాకిస్తాన్‌లో పాకిస్తాన్ సైన్య దౌర్జన్యాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు ఉన్నవేళ ఆయన భారతదేశానికి చేరుకున్నారు. ఆ సమయంలో అతని బూట్లలో కొన్ని పత్రాలు, మ్యాప్‌లు సహా జేబులో రూ.20 మాత్రమే ఉన్నాయి. అతను పాకిస్తానీ గూఢచారి అని అనుమానిస్తూ, సరిహద్దు వద్ద భారత బలగాలు అతణ్ని కాల్చివేసి, తరువాత పఠాన్‌కోట్‌కు తీసుకెళ్లాయి. అక్కడ సీనియర్ సైనిక అధికారులు ఆయన్ను ప్రశ్నించారు.


అప్పుడు జహీర్ పాకిస్తాన్ సైన్యం మోహరింపులకు సంబంధించిన పత్రాలను చూపినప్పుడు అది తీవ్రమైన పని అని అధికారులకు తెలిసింది. వెంటనే లెఫ్టినెంట్ కల్నల్ జహీర్‌ను ఢిల్లీకి పంపారు. అక్కడ ఆయన అప్పట్లో తూర్పు పాకిస్తాన్‌కు (బంగ్లాదేశ్) వెళ్లడానికి ముందు నెలల తరబడి సురక్షిత గృహంలో ఉన్నారు. తూర్పు పాకిస్థాన్‌లో లెఫ్టినెంట్ కల్నల్ జహీర్.. ముక్తి బహినీ సైన్యానికి పాకిస్థానీ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు శిక్షణ ఇచ్చాడు.






Also Read: రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?


Also Read: సెకండ్ జనరేషన్ కరోనా వ్యాక్సిన్లు వస్తే ప్రయోజనం.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ కీలక వ్యాఖ్యలు


Also Read: ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి