Bangalore News: బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్యకు గురైన మహాలక్ష్మి జీవితంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భర్తను విడిచి ఉంటున్న వివాహిత మహాలక్ష్మి కొంత కాలంగా అష్రప్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని తేలింది. అయితే ఆమె దారుణ హత్యతో భర్త హేమంత్ దాస్‌కు కానీ స్నేహితుడు అష్రఫ్‌కు సంబంధం లేదని పోలీసుల విచారణలో స్పష్టమైంది. ఈ హత్యతో సంబంధం ఉన్న మూడో వ్యక్తి కోసం పోలీసుల వెతుకులాట కొనసాగుతోంది.
అసలు ఈ మహాలక్ష్మి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది?:
బెంగళూరు వయాలీకావల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్యకు గురైన మహాలక్ష్మికి సంబంధించిన కేసులో బెంగళూరు పోలీసులు కొంత పురోగతి సాధించారు. నేపాల్‌కు చెందిన మహాలక్ష్మి 2019 నుంచి బెంగళూరులో ఉంటోంది. 2019 ముందు వరకు కుటుంబసభ్యులతో ఉన్న మహాలక్ష్మి వివాహం తర్వాత భర్తతో కలిసి బెంగళూరుకు వచ్చినట్లు ఆమె తల్లి తెలిపారు.
మహాలక్ష్మి భర్త హేమంత్ దాస్ కూడా నేపాలీ వ్యక్తే. వివాహం తరువాత బతుకుదెరువు కోసం వచ్చిన బెంగళూరుకు వచ్చిన హేమంత్‌దాస్ ఓ సెల్‌ఫోన్ షాప్‌లో పనికి కుదిరాడు. భార్య ఏమో ఓ మాల్‌లో పని చేస్తూ ఉండేది. వీరికి ఒక బిడ్డ కూడా పుట్టింది. 2023 వరకు సాఫీగా సాగిన వీరి జీవితంలోకి ఉత్తరాఖండ్‌కు చెందిన హెయిర్ డ్రస్సెర్ అష్రాఫ్ ప్రవేశంతో ఒడిదుడుకులు మొదలయ్యాయి. అష్రాఫ్‌తో మహాలక్ష్మి చనువుగా ఉండడం పట్ల హేమంత్‌కు ఆమెకు మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో బిడ్డను ఆర్నెళ్ల క్రితం భర్త దగ్గరే వదిలి మహాలక్ష్మి ఒంటరిగా ఉంటోంది. బిడ్డ దగ్గరకు వారానికో నెలకోసారి వెళ్లి వస్తుండేది.
ఇంతలోనే దారుణ హత్య.. హత్యచేసిన మూడోవాడు ఎక్కడ?:
ఈ క్రమంలో.. కొద్ది రోజుల క్రితం మహాలక్ష్మి నివసించే వయాలీకావల్ ప్లాట్ గదిలో నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగు పొరుగు వారు ఓనర్‌కు చెప్పారు. అతడు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్లు వచ్చి గది తలుపులు తెరిచారు. గదిలో నేలంతా మాంసం ముక్కలు, రక్తం మరకలు ఉన్నాయి. ప్రిడ్జ్‌లో కుళ్లిన శరీర భాగాలు 40 వరకూ ఉన్నాయి. అసలు ఆ మృతదేహం ఎవరిది అని గుర్తించడానికి కూడా పోలీసులకు కష్టంగా మారింది. ఈ క్రమంలో ఈ కేసును త్వరితగతిన ఛేదించాలంటూ కర్ణాటక సర్కారు పోలీసులను ఆదేశించింది.
విచారణను ముమ్మరం చేసిన పోలీసులు దారుణ హత్యకు గురైన మహిళ 29 ఏళ్ల మహాలక్ష్మిగా తేల్చారు. ఆమె భర్త హేమంత్‌దాస్‌ను విచారించడంతో మహాలక్ష్మి జీవితంలో ఉన్న ప్రేమికుడు అష్రాఫ్ గురించి బయటపడింది. అతడ్ని కూడా పోలీసులు విచారించారు. మహాలక్ష్మి ఫోన్‌కు సెప్టెంబర్ 2 నుంచి ఏ విధమైన అవుట్ గోయింగ్ కానీ ఇన్‌కమింగ్ కాల్స్ కానీ లేవు. అంటే ఆ రోజు లేదా మరుసటి రోజు ఆమె హత్యకు గురై ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ సమయంలోనే ఆమె భర్త హేమంత్‌దాస్, స్నేహితుడు అష్రఫ్ ఫోన్లలో కూడా ఏ విధమైన అనుమానించ దగ్గ ఆధారాలు దొరకలేదని పోలీసులు తెలిపారు.
వీళ్లిద్దరూ కాకుండా మరో వ్యక్తి ఆమె జీవితంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరుగు పొరుగు వాళ్లు కూడా ఆమె ప్లాట్‌కు ఒక వ్యక్తి తరచూ వస్తూ వెళ్తుండే వాడని అంటున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు కాకుండా మరో వ్యక్తి ప్రమేయం ఈ హత్యలో ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
Also Read: సినిమా సీన్ రిపీట్ - బురఖాలో లేడీస్ హాస్టల్‌కు యువకుడు, కట్ చేస్తే!