Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్‌ లోయ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 20 మందికిపైగా మృతి చెందారు. మరో 10 మందికిపైగా టూరిస్టులు గాయపడ్డారు. పర్యాటకులు ఎక్కువగా ఉండే కాలంలో 'మినీ-స్విట్జర్లాండ్' అని పిలుచుకునే అనంతనాగ్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంలో ఈ ఘటన జరిగింది. జమ్మూకశ్మీర్‌లో ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. 

Continues below advertisement


జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులు భారీగా తరలివస్తున్న సమయంలో, అమర్‌నాథ్ యాత్ర జులైలో ప్రారంభంకానున్న టైంలో జరిగిన ఘటన సంతలనంగా మారుతోంది. రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) అనేది లష్కరే తోయిబా (LeT)కు చెందిన ఒక శాఖ. ఇది ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ఏర్పడింది. ఆర్టికల్ 370 తర్వాత ఆరు నెలల్లోనే, లష్కరే తోయిబా (LeT)తో సహా వివిధ వర్గాల ఉగ్రవాదులను ఏకీకృతం చేయడం ద్వారా ఉనికిలోకి వచ్చింది. 


2023 జనవరిలో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద TRF, దాని సంఘాలను ఉగ్రవాద సంస్థగా హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. TRF "భారత దేశానికి వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ ప్రజలను ఉగ్రవాద సంస్థల్లో చేరమని ప్రేరేపించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వాడుకుంటోంది " అని మంత్రిత్వ శాఖ తెలిపింది.


ఈ ఫ్రంట్‌తో సంబంధం ఉన్న కొంతమంది ప్రముఖ ఉగ్రవాదులు సాజిద్ జాట్, సజ్జాద్ గుల్, సలీం రెహ్మానీ, వీరందరూ LeTతో సంబంధం కలిగి ఉన్నారు. మొదటి నుంచి లష్కరే తోయిబా (LeT) ప్రతినిధిగా పరిగణించే ఈ టీఆర్‌ఎశ్‌ పర్యాటకులు, మైనారిటీ కాశ్మీరీ పండిట్లు, లోయలోని వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది.


ఈ బృందం గండేర్‌బాల్ జిల్లాలోని ఒక నిర్మాణ స్థలంలో బహిరంగ కాల్పులకు పాల్పడింది. అందులో ఏడుగురు మరణించారు. బాధితుల్లో ఒక కాశ్మీరీ వైద్యుడు, కార్మికులు, ఒక కాంట్రాక్టర్ ఉన్నారు.


ఈ దాడిన జరిగిన వెంటనే రివ్యూ మీటింగ్ నిర్వహించిన అమిత్‌షా వెంటనే జమ్ముకశ్మీర్ బయల్దేరి వెళ్లారు. బాధితులను పరామర్శించనున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.  






ఇలాంటి దాడులపై  స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఉపాధికి గండి పడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన చాలా ఆందోళన కలిగిస్తోందని ప్రజలు అన్నారు. ఇది జరగకూడని పనిగా అభిప్రాయపడుతున్నారు. వార్తా సంస్థ ANIతో మాట్లాడిన స్థానికులు... " ఈ ఘటన మాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడి కారణంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది అందరికీ నష్టం. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ సంఘటన తర్వాత, మేము కూడా ఆందోళన చెందుతున్నాము. మా ఏరియాకు వచ్చిన అతిథులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటివి జరగకూడదు."