Smriti Irani:
రాహుల్‌పై సంచలన ఆరోపణలు
రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ తన ప్రసంగాన్ని ముగించే ముందు మహిళా ఎంపీలకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపించారు. ఈ వైఖరిని ఖండిస్తున్నానని మండి పడ్డారు. దేశ చరిత్రలోనే పార్లమెంట్‌లో ఇలాంటి సంఘటన జరగలేదని అసహనం వ్యక్తం చేశారు.
సభను విడిచి వెళ్లే ముందు రాహుల్ ఇలా చేశారని ఆరోపించారు.
"నేనో విషయాన్ని ఖండిస్తున్నాను. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు రాహుల్‌కి అవకాశమిస్తే వెళ్లిపోయే ముందు అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఆడవాళ్లను గౌరవించని వాళ్లే ఇలా ప్రవర్తిస్తారు. మహిళా ఎంపీలు కూర్చున్న వైపు చూస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. పార్లమెంట్‌లో ఓ ఎంపీ ఇలా చేయడం మన దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేదు"
- స్మృతి ఇరానీ, కేంద్రమంత్రి
బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా రాహుల్‌పై మండి పడ్డారు. ఇది సిగ్గు చేటు అంటూ విమర్శించారు.
"గతంలో కన్ను కొట్టారు. ఇప్పుడు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. రాహుల్ గాంధీ వైఖరి సిగ్గు చేటు. మహిళల గురించి అంత గొప్పగా మాట్లాడి చివరకు ఇలా చేయడమేంటి..? ఇది మహిళలను అవమానించడం కాదా..?"
- షెహజాద్ పూనావాలా, బీజేపీ జాతీయ ప్రతినిధి
కేంద్రమంత్రి శోభా కరండ్లజే లోక్‌సభ స్పీకర్‌కి రాహుల్‌పై ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ అభ్యంతరకరంగా ప్రవర్తించారని కంప్లెయింట్ ఇచ్చారు. ఈ లెటర్‌పై బీజేపీ మహిళా ఎంపీలు సంతకాలు చేశారు.