PM Modi: 



కాంగ్రెస్‌ని టార్గెట్ చేసిన మోదీ..


ప్రతిపక్ష నేతలపై విమర్శల డోస్‌ పెంచారు ప్రధాని మోదీ (PM Modi). ముఖ్యంగా కాంగ్రెస్‌ని టార్గెట్‌గా చేసుకుని సెటైర్లు వేస్తున్నారు. నిజానికి ఇండియా కూటమిలో అన్ని పార్టీల కన్నా ఎక్కువగా మోదీ సర్కార్‌ని విమర్శిస్తోంది కాంగ్రెస్ మాత్రమే. మిగతా పార్టీలూ తమ వాయిస్ వినిపిస్తున్నా..కాంగ్రెస్ స్వరం గట్టిగా వినిపిస్తోంది. ఎప్పటిలాగే ప్రధాని "వారసత్వ రాజకీయాలు" అనే ట్యాగ్ తగిలిస్తూ కాంగ్రెస్‌కి గట్టిగానే బదులిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటం వల్ల అధికార, విపక్షాల మధ్య ఈ విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)పై కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. గత నెల NCP చీలిపోయిన సందర్భంలో ఈయన NCP చీఫ్ శరద్‌ పవార్ (Sharad Pawar) గురించి ఆసక్తికర కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. శరద్‌ పవార్‌ ప్రధాని కాకపోవడానికి కారణం...కాంగ్రెస్ చేసిన వారసత్వ రాజకీయాలే అని ఆరోపించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గత నెల NCPలోని కీలక నేత అయిన అజిత్ పవార్ ఆ పార్టీ వదిలి శిందే ప్రభుత్వంలో చేరారు. ఆయనకు డిప్యుటీ సీఎం పదవిని కట్టబెట్టింది బీజేపీ. అప్పటి నుంచి ఎన్‌సీపీ పార్టీ పేరు, గుర్తుపై అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత నెల పుణేలో ప్రధాని నరేంద్ర మోదీకి లోకమాన్య తిలక్ బహుకరించిన సమయంలో శరద్ పవార్ ఆ కార్యక్రమానికి వెళ్లారు. ఒకే వేదికపై ప్రధాని మోదీ, శరద్ పవార్ కనిపించారు. అయితే...మోదీకి అవార్డు ఇచ్చే ఫంక్షన్‌కి శరద్ పవార్‌ వెళ్లడంపై విపక్షాలు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతే కాదు. శరద్ పవార్ NDAలో చేరిపోతారా..? ఇండియా కూటమిలో ఉంటారా అన్న ఆసక్తికర చర్చ కూడా మొదలైంది. 


మహారాష్ట్ర ఎంపీలతో భేటీ..


ఎన్‌డీఏ ఎంపీలతో సమావేశమవుతున్న ప్రధాని మోదీ...మహారాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్‌తో పాటు శరద్ పవార్ కూడా వారసత్వ రాజకీయాలకు అలవాటు పడిపోయారని ఎంపీలతో అన్నట్టు తెలుస్తోంది. అందుకే కొత్త వాళ్లను పైకి రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించినట్టు సమాచారం. ఉద్దవ్ థాక్రే శివసేనపైనా ప్రధాని విమర్శలు గుప్పించారని కొందరు చెప్పారు. బీజేపీ శివసేనతో తెగదెంపులు చేసుకోలేదని స్పష్టం చేశారు. 


"అనవసరంగా చాలా సార్లు వివాదం చేశారు. ఎన్నో సందర్భాల్లో మేం ఓపిక పట్టాం. మీరే అధికారంలో ఉండాలనుకుంటూనే మళ్లీ బీజేపీపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఇలా రెండు విధానాలు ఎందుకు.."


- ఎంపీలతో ప్రధాని మోదీ


ఎంపీలకు వార్నింగ్..! 


ఇదే సమయంలో ఎంపీలకు మోదీ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు పనులు చేసిన వాళ్లకు ఈ సారి టికెట్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఇలా తప్పు చేసిన ఎంపీలు కొందరు తన వద్దకు వచ్చి క్షమాపణలు కోరినట్టు ఈ భేటీలో చెప్పారని కొందరు నేతలు వివరించారు. 


Also Read: పార్లమెంట్‌ని వేడెక్కిస్తున్న రాజకీయాలు, రాహుల్ రీ ఎంట్రీతో మరింత ఆసక్తికరం