Chandrayaan-3: చంద్రుడిపై ప్రయోగాలు చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రస్తుతం జాబిల్లి కక్ష్యలో తిరుగుతోంది. అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే ఈనెల 23న చంద్రయాన్ చంద్రుడిపై దిగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్ ల్యాండింగ్‌పై ఇస్రో చైర్మన్ సోమనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్, అన్ని సెన్సార్లు, దాని రెండు ఇంజిన్లు పని చేయకపోయినా ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్-ల్యాండింగ్ చేయగలదని అన్నారు.
అన్ని రకాల వైఫల్యాలను తట్టుకునేలా ల్యాండర్ 'విక్రమ్' డిజైన్ చేశామన్నారు. ఇది ఫెయిల్యూర్ విధానంలో పని చేస్తుందన్నారు. మంగళవారం బెంగళూరులో దిశా భారత్ ఎన్జీఓ సంస్థ ఏర్పాటు చేసిన 'చంద్రయాన్-3: భారత్స్ ప్రైడ్ స్పేస్ మిషన్' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రయాన్ గురించి వివరిస్తూ... అంతా విఫలమై, అన్ని సెన్సార్లు ఆగిపోయినా, ఏమీ పని చేయకపోయినా, ప్రొపల్షన్ సిస్టమ్ ఒక్కటి బాగా పనిచేస్తే విక్రమ్ ల్యాండింగ్ చేస్తుందన్నారు. ఫెయిల్యూర్ విధానంలో రూపొందించినట్లు చెప్పారు.
జూలై 14న అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ ఆగస్టు 5న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. దానిని చంద్రునికి దగ్గరగా తీసుకురావడానికి మరో మూడు డీ ఆర్బిటరీ విన్యాసాలు జరగాల్సి ఉంది. అన్ని కసరత్తుల తరువాత ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండింగ్ అవుతుంది. ఆగస్టు 9, ఆగస్టు 14, ఆగస్టు 16 తేదీల్లో నిర్వహించే డీ ఆర్బిటరీ విన్యాసాల ద్వారా చంద్రయాన్ చంద్రుడి నుంచి 100 కిమీx 100 కిమీల దూరం వరకు తగ్గిస్తారని సోమనాథ్ వివరించారు.
ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యూల్ సెపరేషన్ ఎక్సర్‌సైజ్ ల్యాండర్ డీబూస్ట్ తర్వాత వెంటనే చేపడతామని, ఈ ప్రక్రియ ల్యాండర్ వేగాన్ని తగ్గిస్తుందన్నారు. ఆ తర్వాత ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుందని ఆయన వివరించారు. ఈసారి కూడా ల్యాండర్ విక్రమ్‌లో రెండు ఇంజన్లు పని చేయకపోయినా, ఇంకా ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అల్గారిథమ్‌లు సరిగ్గా పనిచేస్తే విక్రమ్ అనేక వైఫల్యాలను విజయవంతంగా ఎదుర్కొంటుందని నిర్ధారించుకునేలా డిజైన్ చేసినట్లు ఆయన వివరించారు.
చంద్రుని ఉపరితలంపై నిలువుగా 'విక్రమ్' ల్యాండ్ చేయడమే ఇస్రో ముందున్న అతిపెద్ద సవాలు అని సోమనాథ్ అన్నారు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయిన తర్వాత, అది అడ్డంగా కదులుతుందన్నారు. విన్యాసాల అనంతరం చంద్రునిపై సురక్షితంగా ల్యాండ్ చేయడానికి నిలువు స్థితికి తీసుకువస్తామన్నారు. చంద్రయాన్-2 మిషన్ సమయంలో ఇస్రో తన ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా తాకడంలో విఫలమైనందని, ఈ సారి ప్రక్రియా చాలా కీలకమైనదని పేర్కొన్నారు.
గతంలో క్షితిజ సమాంతర నుంచి నిలువు దిశకు తీసుకురావడంలో సమస్యను ఎదుర్కొన్నట్లు చెప్పారు. స్పేస్ క్రాఫ్ట్‌లో ఇంధనం తక్కువగా ఉందని, దూర గణనలు సరిగ్గా ఉన్నాయని, అన్ని అల్గారిథమ్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోవడం కూడా సవాలే అని అభిప్రాయపడ్డారు. అయితే ఈ సారి లెక్కల్లో కొన్ని తేడాలు ఉన్నాయని, విక్రమ్‌ను సురక్షితంగా ల్యాండ్ చేసేలా ఇస్రో అన్ని ప్రయత్నాలు చేసిందని సోమనాథ్ వివరించారు.
ల్యాండర్‌లో నాలుగు పేలోడ్‌లు ఉంటాయని, చంద్ర సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (ChaSTE) ధ్రువ ప్రాంతానికి సమీపంలో ఉన్న చంద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రతలు, లక్షణాల కొలతలను తీసుకుంటుంది. RAMBHA-LP పేలోడ్ సమీప ఉపరితల ప్లాస్మా (అయాన్లు, ఎలక్ట్రాన్లు) సాంద్రత మార్పులను కొలుస్తుంది. NASA తయారుచేసి లేజర్ రెట్రోరెఫ్లెక్టర్ అర్రే భవిష్యత్ కక్ష్యలు, చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ ఖచ్చితమైన స్థాన కొలతు, లూనార్ సిస్మిక్ యాక్టివిటీ కోసం ఇన్‌స్ట్రుమెంట్ ఉన్నాయి.
'ప్రజ్ఞాన్' అనే రోవర్ మూడు పేలోడ్‌లను కలిగి ఉంటుంది. లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) చంద్రుని ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న చంద్రుడి నేల, రాళ్లను నిర్ధారిస్తుంది. ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (APXS) పేలోడ్ చంద్రుని ఉపరితలంపై రసాయన, ఖనిజ సంబంధత అంశాలను అంచనా వేస్తుంది. స్పెక్ట్రో-పోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (SHAPE) సమీప-ఇన్‌ఫ్రారెడ్ (NIR) తరంగదైర్ఘ్యం పరిధిలో నివాసయోగ్యమైన భూమి, స్పెక్ట్రో-పోలారిమెట్రిక్ గుర్తులను అధ్యయనం చేస్తుంది.