Ajay Bisaria New Book: భారత్ దెబ్బకు దాయాది దేశం గజ గజ వణికిపోయింది. 2019 ఫిబ్రవరి 27న భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ చేజిక్కిన వేళ పాక్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందట. రెండే రోజుల్లో వర్ధమాన్‌ను విడిచిపెట్టి బతుకు జీవుడా..అని ఊపిరిపీల్చుకుంది. ఈ విషయాలను భారత హై కమిషనర్‌గా పనిచేసిన అజయ్‌ బిసారియా తాజా రాసిన 'యాంగర్ మేనేజ్‌మెంట్: ది ట్రబుల్డ్ డిప్లొమాటిక్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్థాన్' పుస్తకంలో వెల్లడించారు. భారత్‌, పాక్‌ మధ్య దౌత్య సంబంధాలపై ఈ మాజీ దౌత్యవేత్త రాసిన ఈ పుస్తకం త్వరలోనే విడుదల కానుంది. ఇందులో ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.



పలు దేశాల మధ్యవర్తిత్వం
బాలాకోట్‌ వైమానిక దాడుల తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా మధ్యవర్తిత్వం వహించడానికి పలు దేశాలు ఆసక్తి చూపినట్లు మాజీ దౌత్యవేత్త అజయ్‌ బిసారియా తెలిపారు. చైనా సైతం ఓ ఉపమంత్రిని ఉభయ దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి పంపేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. కానీ, భారత్‌ సున్నితంగా తిరస్కరించిందని పేర్కొన్నారు. బాలాకోట్‌ ఘటన జరిగిన మరుసటి రోజు 2019 ఫిబ్రవరి 27న పాక్‌ వైమానిక దళం ఎఫ్‌-16 విమానాలతో భారత్‌పై దాడికి యత్నించింది. 


తిరస్కరించిన పాక్
వాటిని తిప్పికొట్టే క్రమంలో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాక్‌ జవాన్ల చేతికి చిక్కారు. ఆయన్ని తీసుకురావడానికి భారత్‌ సైనిక విమానాన్ని పంపేందుకు సిద్ధమైందని కానీ, అందుకు పాక్‌ నిరాకరించిందని తెలిపారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత వాయుసేన విమానం పాక్ భూభాగంలోకి అనుమతించడాన్ని వారు ప్రమాదంగా భావించారని వివరించారు.  


రాత్రి అంతా చర్చలే
బాలాకోట్‌పై భారత వాయుసేన దాడుల తర్వాత పాకిస్థాన్‌ విదేశాంగ కార్యదర్శి తెహ్‌మినా జన్‌జువాకు ఆ దేశ సైనికాధికారుల నుంచి కీలక సమాచారం అందిందని బిసారియా తన పుస్తకంలో రాసుకొచ్చారు. దాన్ని ఆమె అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ రాయబారులకు చేరవేశారని తెలిపారు. భారత్‌ తొమ్మిది క్షిపణులను పాక్‌పైకి ఎక్కుపెట్టిందని.. వాటిని ఏ క్షణంలోనైనా ప్రయోగించే అవకాశం ఉందనేది వారికి అందిన సందేశమని వెల్లడించారు. దీన్ని వెంటనే మీ ప్రభుత్వాలకు తెలియజేసి.. భారత్‌కు సర్దిచెప్పాలని పాక్‌ కార్యదర్శి ఆయా రాయబారులను కోరినట్లు తెలిపారు. ఈ విషయాన్ని వారు వెంటనే తమ దేశాలకు తెలియజేసినట్లు వివరించారు. ఐక్యారాజ్య సమితిలో వీటో అధికారం ఉన్న ఐదు దేశాలతో పాటు భారత్‌, పాక్‌ మధ్య ఆరోజు రాత్రి పెద్ద ఎత్తున దౌత్యపరమైన కార్యక్రమాలు జరిగాయని చెప్పారు.


మోదీ స్పందించలేదు
‘ఆ సమయంలో భారత్‌కు అప్పటి పాక్‌ హైకమిషనర్‌ సోహైల్‌ మహమ్మద్‌ ఇస్లామాబాద్‌లో ఉన్నారు. ఫిబ్రవరి 27 అర్ధరాత్రి ఆయన నన్ను సంప్రదించారు. మోదీతో ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోన్‌లో మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పారు. నేను వెంటనే ఢిల్లీలోని అధికారులకు సమాచారమిచ్చాను. అప్పుడు ఖాన్‌తో మాట్లాడేందుకు ప్రధాని మోదీ అందుబాటులో లేరని అధికారులు చెప్పారు. పాక్‌కు ఏదైనా అత్యవసరమైతే హైకమిషనర్‌  తోనే మాట్లాడాలని చెప్పాలని సూచించారు. ఆ తర్వాత పాక్‌ అధికారులు మళ్లీ నాతో సంప్రదించలేదు’ అని అజయ్‌ తన పుస్తకంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.  


దర్యాప్తు చేసేందుకు అంగీకారం
పాకిస్థాన్‌ నేరుగా తమ ఆందోళనలకు భారత్‌కు వివరించాలని సమాచారం అందుకున్న దేశాల్లో ఒకటి సూచించినట్లు బిసారియా తన పుస్తకంలో రాశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో అప్పటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మాట్లాడడానికి చేసిన ప్రయత్నం విఫలమైందని తెలిపారు. దీంతో ఢిల్లీలోని అమెరికా, యూకే రాయబారులు అదేరోజు రాత్రి భారత విదేశాంగశాఖ కార్యదర్శిని సంప్రదించారని వెల్లడించారు. ‘ఘర్షణపూరిత వాతావరణం నుంచి వెనక్కి తగ్గేందుకు పాక్‌ సిద్ధమైంది. భారత్‌ ఇచ్చే సమాచారం ఆధారంగా దర్యాప్తు జరిపేందుకు అంగీకరించింది. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి చర్యలు తీసుకుంటామంది. ఇమ్రాన్‌ ఖాన్‌ స్వయంగా ఈ ప్రకటనలు చేయడంతో పాటు అభినందన్‌ను కూడా రేపు విడిచిపెడతారు’ అని వారు చెప్పినట్లు బిసారియా వెల్లడించారు. 


చైనా సూచన
ఈ క్రమంలో ఇమ్రాన్‌ఖాన్‌ చైనా సాయం కోరారని బిసారియా తెలిపారు. భారత్‌కు అమెరికా మద్దతిస్తున్నందున, చైనా తమ వెంటే ఉండాలని పాక్ కోరినట్లు చెప్పారు. కానీ, జిన్‌పింగ్‌ దాన్ని తిరస్కరించారని పేర్కొన్నారు. భారత్‌పైకి పాక్‌ను ఎగదోసేందుకు చైనా సహకరించబోదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని తనకు సమాచారం అందిందన్నారు. భారత్‌తో అమెరికాకు సన్నిహిత సంబంధాలున్నందున పాక్‌ నేరుగా అగ్రదేశంతోనే సంప్రదింపులు జరపాలని జిన్‌పింగ్‌ హితవు పలికారని చెప్పారు.
  
మోదీ చేసిన వ్యాఖ్యలు అవేనా?
2019లో ప్రధాని మోదీ ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ‘అభినందన్‌ను పాక్‌ విడిచిపెట్టి మంచి పని చేసింది. లేదంటే వారు భయంకరమైన రాత్రిని చవిచూడాల్సి వచ్చేది’ అని అన్నారు. అప్పుడు మోదీ చేసిన వ్యాఖ్యలకు అజయ్‌ బిసారియా తన పుస్తకంలో రాసుకొచ్చిన విషయాలు బలాన్ని చేకూరుస్తున్నాయి.