India Vs Bharat Controversy: దేశం పేరు ఇండియా నుంచి భారత్‌కు మార్చాలనే వివాదం ఇప్పటిది కాదు. ఇప్పుడు అంటే సోషల్ మీడియా వాడకం పెరగడంతో ‘భారత్’ వివాదం ట్రెండింగ్‌లో ఉంది. అయితే దీనికంటే ముందు రెండు సార్లు దేశం పేరు ఇండియాను భారత్ అని పిలవాలని పిటిషన్లు నమోదయ్యాయి. అయితే వాటిని దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇండియాను భారత్ అని పిలవాలంటూ 2020లో కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మూడు సంవత్సరాల క్రితం కొట్టివేసింది. 2016లో కూడా ఇదే విధమైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
అయితే తాజాగా రాష్ట్రపతి భవన్ మొదటగా, G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ప్రపంచ నేతలను విందుకు ఆహ్వానిస్తూ పంపిన ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉండడంతో వివాదం మొదలైంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రను వక్రీకరించి దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఈ పరిణామం ప్రతిపక్ష కూటమి I.N.D.I.A, అధికార బీజేపీ మధ్య వివాదానికి దారితీసింది.
దీంతో బీజేపీ నేతలు సైతం ఎదురుదాడికి దిగారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రతిపక్షాలకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. మన దేశం పేరు భారత్ అని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. భారత్‌ను భారత్‌గా కాకుండా ఏమని పిలుస్తామని ప్రశ్నించారు.
'ఇండియా' పేరు మార్చడంపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
అయితే, 'ఇండియా' పేరును 'భారత్'గా మార్చాలనే డిమాండ్ కొత్తది కాదు. గతంలో రెండు సందర్భాలలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వచ్చాయి. 2020లో ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త రాజ్యాంగంలోని ఆర్టికల్ 1కి సవరణ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్ 1(1) ప్రకారం, ‘భారతదేశం, అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉండాలి.’ అధికారిక ప్రయోజనాల కోసం దేశాన్ని ఎలా పిలవాలనే దానిపై రాజ్యాంగంలో ఉన్న ఏకైక నిబంధన ఇది.
పిటిషనర్ తన పిటిషన్‌లో ‘ఇండియా’ అనే పేరు గ్రీకు మూలానికి చెందినదని ‘ఇండికా’ అనే పదం నుండి వచ్చిందని చెప్పాడు. ‘ఇండియా’ అనే ఆంగ్ల పేరు దేశం సంస్కృతి, సంప్రదాయానికి ప్రాతినిధ్యం వహించదని పేర్కొన్నారు. ఇండియాను భారత్‌తో భర్తీ చేయడం ద్వారా మన పూర్వీకులు కష్టపడి సాధించుకున్న స్వాతంత్య్రాన్ని సమర్ధించవచ్చని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ బాబ్డే పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. భారత్, ఇండియా అనేవి రెండూ రాజ్యాంగంలో ఇవ్వబడిన పేర్లేనని, ఇండియా ఇప్పటికే రాజ్యాంగంలో 'భారత్' అని పిలుస్తున్నారని అన్నారు. 2016లో ఇదే విధమైన పిటిషన్‌ను రాగా అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా తిరస్కరించింది. CJI స్పందిస్తూ ప్రతి భారతీయుడికి దేశాన్ని ‘భారత్’ లేదా ఇండియా అని పిలవడాన్ని ఎంచుకునే హక్కు ఉందని చెప్పారు. ఒక పౌరుడు దేశాన్ని ఏమని పిలవాలో సుప్రీంకోర్టు నిర్ణయించలేదన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ఎలా వచ్చింది?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 మన దేశాన్ని ఏమని పిలువాలనేది నిర్దేశించే కీలకమైన నిబంధన. ముసాయిదా ఆర్టికల్ 1 సెప్టెంబర్ 18, 1949న రాజ్యాంగ సభ ద్వారా ఆమోదించబడింది. చర్చల సమయంలో భారత్, హిందుస్థాన్, హింద్, భరతభూమి, భరతవర్ష్ అంటూ అనేక సూచనలు వచ్చాయి. కొంతమంది డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు భారత్‌కు ప్రాధాన్యత ఇవ్వగా మరికొందరు ఇండియాగా పిలవాలని సూచించారు. చివరకు రాజ్యాంగ సభ ఈ ప్రకటనకు ఆమోదం తెలిపింది. ‘ఇండియా అంటే భారత్ అని, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది’ అని ఆమోద ముద్ర వేసింది.