India Vs Bharat Controversy: జీ 20 సదస్సు నేపథ్యంలో సెప్టెంబరు 9వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇందుకు ఆహ్వానిస్తూ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడంతో.. ఒక్కసారిగా మోదీ సర్కారు దేశం పేరు మారుస్తోందన్న చర్చ మొదలైంది. త్వరలోనే దేశం పేరును ఇండియాగా కాకుండా భారత్ గా మారుస్తారని, ప్రత్యేక పార్లమెంటు సమావేశంలో ఇందుకు సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెడతారని రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వార్తలపై ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా.. గతంలో వివిధ వ్యక్తులు మాట్లాడిన వీడియోలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
దేశం పేరును మారుస్తారన్న అంశంపై మాజీ క్రికెటర్, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉండే వీరేందర్ సెహ్వాగ్ స్పందించారు. 'ఒక పేరు మనలో గర్వాన్ని నింపేదిగా ఉండాలని నేనెప్పుడూ నమ్ముతాను. మనం భారతీయులం. ఇండియా అనే పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారు. దేశ అసలు పేరైన భారత్ ను అధికారికంగా తిరిగి తెచ్చుకునే సమయం వచ్చేసింది. ఈ వన్డే ప్రపంచకప్ లో మన ఆటగాళ్ల ఛాతీపై భారత్ అని ఉండేలా చూసుకోవాలి' అంటూ బీసీసీఐని, సెక్రటరీ జైషాను ట్యాగ్ చేశారు.
వీరేందర్ సెహ్వాగ్ దేశం పేరును భారత్ గా మార్చేందుకు మద్దతు ఇవ్వడంతో పలువురు ఆయనను ట్విట్టర్ వేదికగా విమర్శించడం మొదలుపెట్టారు. వాటిపై కూడా సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించారు. 'నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. గత రెండు ఎన్నికల్లోనూ రెండు ప్రధాన పార్టీలు నన్ను సంప్రదించాయి. చాలా మంది ఎంటర్‌టైనర్‌లు, క్రీడాకారులు రాజకీయాల్లోకి రాకూడదనేది నా అభిప్రాయం. చాలా మంది తమ సొంత ఇగో, అధికారం కోసం ఆకలితో ఉంటారు. ప్రజల కోసం నిజమైన సమయాన్ని వెచ్చిస్తారు. కొంత మంది అందుకు మినహాయింపు. కొంతమంది కేవలం ప్రచారం కోసమే చేస్తారు. క్రికెట్ తో కలిసి ఉండటం, కామెంటేటింగ్ చేయడం అంటేనే నాకు ఇష్టం. ఒక పార్ట్‌టైమ్ ఎంపీగా ఉండటాన్ని నేను కోరుకోవడం లేదు' అని సెహ్వాగ్ స్పందించారు.
ప్రతిపక్ష కూటమి పేరును ఇండియా(I.N.D.I.A) అని పెట్టుకోవడంతో.. ఇండియాగా ఉన్న దేశం పేరునే మోదీ ప్రభుత్వం మార్చాలని చూస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఒకవేళ ప్రతిపక్ష కూటమి పేరును భారత్ అని పెట్టుకుంటే.. దేశం పేరును కూడా మార్చేస్తారా.. అప్పుడు దేశానికి బీజేపీ అని పేరు పెడతారా.. అంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
దేశం పేరు మార్పు ఊహాగానాలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఫాసిస్ట్ బీజేపీ పాలనను గద్దె దించేందుకు ప్రతిపక్ష కూటమికి ఇండియా అని పేరు పెడితే.. దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలని బీజేపీ అనుకుంటోందని స్టాలిన్ విమర్శించారు. దేశాన్ని మారుస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని.. కానీ 9 ఏళ్ల పాలన తర్వాత దేశం పేరు మాత్రమే మారుస్తున్నారని స్టాలిన్ మండిపడ్డారు.
గతంలో వివిధ సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్, సద్గురు జగ్గీ వాసుదేవ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పలువురు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.