Onion Price Hike మొన్నటి వరకు టమాటా ధరలు సామాన్య ప్రజలను కన్నీళ్లు పెట్టించాయి. ప్రస్తుతం ఉల్లి కూడా కోయక ముందే కంటనీరు తెప్పిస్తోంది. ధరలతోనే సామాన్య ప్రజల గుండెల్లో వేగాన్ని పెంచుతోంది. రోజురోజుకూ ఉల్లిగడ్డ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రభుత్వం నాఫెడ్ ద్వారా ఉల్లిని సేకరించి మార్కెట్లకు తరలిస్తున్నప్పటికీ ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇందుకు కారణం ఆంధ్ర ప్రదేశ్‌లో ఉల్లి సాగు తగ్గడమేనని నిపుణులు చెబుతున్నారు. అలాగే కర్ణాటకలో కూడా కొత్త పంట చేతికి రాకపోవడంతో రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని అంటున్నారు. ఏపీలో ఉల్లి సాగు తగ్గడంతో ధరలు కూడా రెండు రెట్లు పెరిగాయి. మార్చి నెలలో 10 రూపాయల నుంచి 15 రూపాయలు కిలోగా ఉన్న ఇల్లి ప్రస్తుతం 30 నుంచి 40 రూపాయలకు వరకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఉల్లిపాయల మార్కెట్‌ కి ఉల్లి రాక విపరీతంగా తగ్గిపోయింది. గతంలో మార్కెట్‌ కు రోజుకు 90 లారీల ఉల్లి వచ్చేది. కానీ ప్రస్తుతం అది గణనీయంగా తగ్గింది. రోజుకి ఒకటి నుంచి రెండు లారీల ఉల్లి మాత్రమే వస్తుండడంతో ఉల్లి ధరలు విపరీతంగా పెరుగుతాయని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


పదిహేను రోజుల క్రితమే ఉల్లి ఎగుమతి సుంకం 40 శాతంగా నిర్ణయం 


కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 19వ తేదీన కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లిపాయలపై ఎగుమతి సుంకాన్ని 40 శాతంగా నిర్ణయించారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఎగుమతి పన్ను అమలులో ఉండనుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. ఇటీవల టమాటా ధరల పెంపును గమనించిన ప్రభుత్వం ఉల్లిపాయల విషయంలో జాగ్రత్త పడింది. ఎగుమతి సుంకం పెంపుతో దేశంలో ఉల్లి సరఫరా పెరిగితే, ధరలు అదుపులో ఉంటాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. కేంద్రం నిర్ణయంతో సామాన్యులకు ఉల్లి ధరల నుంచి ఊరట కలగనుంది. ఎగుమతులు అధికం కావడం, దేశంలో సరఫరా తగ్గిపోతే ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో ఉల్లి ధరల పెరుగుదల ఉంటుందని నిపుణులు ముందుగానే హెచ్చరించారు. ఇటీవల బియ్యం ధరలను నియంత్రించడంలో భాగంగా బాస్మతీయేతర బియ్యం ఎగుమతిని ప్రభుత్వం నిషేధించడం తెలిసిందే. ఈ నిషేధం అమెరికా లాంటి దేశాల్లో ప్రభావం చూపింది. ఉల్లి ధర కొన్ని వారాలుగా పెరుగుతూ వస్తోంది. ఆగస్టు చివరి నాటికి రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేశారు. తక్కువ సమయంలో ఉల్లిపాయ కిలో రూ. 60-70కి చేరుకునే అవకాశం ఉందని పీటీఐ గత వారం రిపోర్ట్ చేసింది. 


డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోతే ద్రవోల్బణానికి దారితీసి, ఆగస్టు చివరి నాటికి ఉల్లి ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ ఇటీవలే పేర్కొంది. సెప్టెంబరు నెలలో తొలి వారం నుంచే ఉల్లి ధరలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేశారు. వచ్చే నెల తొలివారానికే ఉల్లి కేజీ రూ. 60-70కి కానుందని.. ఈ రేట్లు 2020లో నమోదైన గరిష్ట ధరల కంటే కొంచెం తక్కువగా ఉంటాయని రిపోర్ట్ చేసింది.