G20 Summit: ప్రధాని నరేంద్ర మోదీ జీ-20 సదస్సుపై ఓ అద్భుతమైన ఆలోచన చేశారు. ఢిల్లీలో జరగబోతున్న ఈ జీ-20 శిఖరాగ్ర సమావేశ నిర్వహణలో వివిధ శాఖలకు చెందిన 100 మంది యువ అధికారులకు అవకాశం ఇవ్వాలని సూచించారు. సివిల్ సర్వెంట్లకు అవకాశం కల్పించే విషయం గురించి జీ-20 ఇండియా ప్రత్యేక కార్యదర్శి ముక్తేష్ పరదేశీ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏర్పాట్లపై మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దాదాపు ఏడాది నుంచి ఈ సదస్సు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఇందుకోసం దాదాపు 60 ప్రాంతాల్లో 200 సదస్సులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు అని తెలిపారు. అలాగే ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు అనుభవజ్ఞులైన సీనియర్, యువకులైన జూనియర్ సివిల్ సర్వెంట్లను భాగస్వాములను చేసినట్లు తెలిపారు.
జీ-20 నిర్వహణ కోసం మంత్రివర్గ నిర్ణయంతో ఓ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేశారని ముక్తేష్ తెలిపారు. అలాగే దీని కార్యదర్శులుగా జాయింట్ సెక్రటరీ పైస్థాయి అధికారులు 10 మంది పని చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ ఇలాంటి ఒక పెద్ద సదస్సు నిర్వహించాలంటే వీరు మాత్రమే ఉంటే సరిపోదని.. అందుకే మరో రెండు దశల్లో మరికొంత మందిని తీసుకన్నామని చెప్పుకొచ్చారు. వీటిల్లో విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయం, వివిధ దౌత్య కార్యాలయాల నుంచి సిబ్బంది తమకు సాయంగా వచ్చినట్లు వివరించారు. వారిని శిక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసినట్లు తెలిపారు. వీటితో పాటు ఆ సిబ్బంది వివిధ గ్రూపులతో కలిసి పని చేస్తున్నారు ముక్తేష్ స్పష్టం చేశారు.
ఈ సదస్సు నుంచి ఎంతో నేర్చుకుంటారు..
వంద మందికి పైగా వివిధ కేడర్లకు చెందిన యువ సివిల్ సర్వెంట్లను ఈ సదస్సులో భాగస్వాం చేస్తే.. వారు ఎంతో నేర్చుకొని భవిష్యత్తులో దేశానికి మరింత సేవ చేస్తారని ప్రధాని మోదీ తెలిపారని ముక్తేష్ వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 140 మంది యువ అధికారులకు ఈ సారి అవకాశం కల్పించామని చెప్పారు. ప్రస్తుతం దిల్లీలో ఎయిర్ పోర్టు నుంచి వివిధ హోటల్స్ వరకు 20 బృందాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆ తర్వాత భారత్ మండపం, మీడియా బృందాల సమన్వయం వంటి వాటికి మరో 100 మంది అవసరం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు వాలంటీర్లను తీసుకోవడం లేదని వివరించారు. కేవలం ప్రభుత్వంతో కలిసి పని చేసిన అనుభవం ఉన్నవారిని మాత్రమే భాగస్వాములను చేస్తున్నామని ముక్తేష్ తెలిపారు.
ఇండియాకు బదులుగా భారత్
జీ 20 సదస్సు నేపథ్యంలో సెప్టెంబరు 9వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్‌కు ఆహ్వానిస్తూ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' కు బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని రాశారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఇలా రాయడంపై వివాదం చెలరేగింది. త్వరలో దేశం పేరు ఆంగ్లంలో కూడా భారత్‌గా మారే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వస్తున్నాయి.