జీ 20 సదస్సు నేపథ్యంలో సెప్టెంబరు 9వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్‌కు ఆహ్వానిస్తూ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా' కు బదులుగా 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌' అని రాశారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ట్వీట్‌ చేశారు. ప్రభుత్వం ఇలా రాయడంపై వివాదం చెలరేగింది. త్వరలో దేశం పేరు ఆంగ్లంలో కూడా భారత్‌గా మారే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వస్తున్నాయి. 


కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఆహ్వానం అందడంతో ఆహ్వాన పత్రికను ట్విట్టర్‌లో షేర్‌ చేసి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జైరాం రమేష్‌ ట్వీట్‌ చేస్తూ..రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1 ప్రకారం.. 'భారత్‌, అది ఇండియా, అది రాష్ట్రాల యూనియన్‌' అని ఉందని ఇప్పుడు యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌పై దాడి జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రను వక్రీకరిస్తున్నారని, ఇండియాను విడదీస్తున్నారని, అదే భారత్‌ అని, అదే యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌ అని, కానీ మేము అడ్డుకోలేమని జైరాం రమేష్ పేర్కొన్నారు. అలాగే I.N.D.I.A కూటమి లక్ష్యం ఏంటంటే.. BHARAT అని పేర్కొన్నారు. BHARAT అంటే.. బ్రింగ్‌ హార్మొని, అమిటీ, రీకాన్సిలేషన్‌ అండ్‌ ట్రస్ట్‌ అని తెలిపారు. జూడేగా భారత్‌, జీతేగా ఇండియా అని ట్వీట్‌ చేశారు.






ఈ పరిణామాలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా స్పందించారు. ఇండియాను బీజేపీ ఎలా తొలగించగలదని ప్రశ్నించారు. దేశ జాతీయ గుర్తింపు కాషాయ పార్టీ వ్యక్తిగత ఆస్తి కాదంటూ ట్వీట్‌ చేశారు.






జీ20 సదస్సు కోసం రూపొందించిన బుక్‌లెట్‌లోనూ దేశం పేరు భారత్‌గా పేర్కొన్నారు. 'భారత్‌ మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ' గా అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పేరు మార్పుపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. దేశం పేరు మార్పు అంశంపై ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 18 నుంచి 22 మధ్య జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ ప్రతిపాదనలు తీసుకురానున్నట్లు అంచనాలు వేస్తున్నారు.