గుంటూరు అధికార పార్టీలో సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యే మద్దాల గిరికి ఈసారి సీటు కేటాయింపుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. 


గుంటూరులో సీట్ల పంచాయితీ...
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. ఇందులో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్ది ముస్తాఫా విజయం సాధించారు. పశ్చిమంలో అయితే తెలుగు దేశం పార్టీ నుంచి గెలిచిన మద్దాలి గిరి, ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు రెండు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. 


వచ్చే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రెండు నియోజకవర్గాలకు ఎవరు పోటీ పడతారనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా గుంటూరు తూర్పులో సిట్టింగ్ శాసన సభ్యుడిగా ఉన్న ముస్తాఫా ఇప్పటికే తన కుమార్తె షేక్ నూరి ఫాతిమాకు సీటు ఇవ్వాలని నేరుగా జగన్ వద్దనే అభ్యర్దన పెట్టుకున్నారు. దీంతో పార్టీ పరంగా సర్వేలు చేయించిన తరువాత జగన్ ముస్తాఫా కుమార్తెకు సీటు ఇచ్చే విషయంలో సానుకూలంగా స్పందించినట్లుగా చెబుతున్నారు.


సీట్ల విషయంలో సజ్జల కీలక సూచనలు...
సిట్టింగ్ శాసన సభ్యులకు సర్వేల ఆధారంగానే సీట్లు కేటాయింపు ఉంటుందని, ఆఖరి నిమిషం వరకు కూడా అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠత ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై రాజకీయంగా విమర్శలు రావటంతో, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ శాసన సభ్యులు, ఇంచార్జ్‌లకు ముందుగానే క్లారిటి ఇచ్చేందుకు పార్టీ కీలక నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. 


పార్టీలో నెంబర్ టు గా ఉన్న విజయ సాయి జిల్లాల వారీగా సమావేశాల ద్వార ఆయా నేతలకు క్లారిటి ఇస్తున్నారు. గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన పలు అంశాలపై ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల పార్టీ కేంద్ర కార్యాలయంలోనే సమావేశం అయ్యారు. పలు అంశాలపై చర్చించిన తరువాత తిరిగి సీట్ల కేటాయింపుపై కూడా ఈ సమావేశంలోనే చెప్పకనే చెప్పారని అంటున్నారు. తూర్పు సీట్‌ను ముస్తాఫా కుమార్తెకు ఇచ్చే విషయంలో కూడా స్పష్టత వచ్చిందని చెబుతున్నారు.


పశ్చిమంలోనే రాని క్లారిటీ...
ప్రస్తుతం గుంటూరు పశ్చిమ స్థానానికి తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చిన మద్దాలి గిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి, కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈ విషయంలో వచ్చే ఎన్నికల్లో మద్దాలి గిరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఛాన్స్ ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పశ్చిమ నియోజకవర్గంలో పార్టీకి చెందిన సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా ఏసురత్నం ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు ఇటీవలే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇదే నియోజకవర్గంలో పార్టీ కీలక నేత అప్పిరెడ్డి కూడా లైన్‌లో ఉండేవాళ్లు. ఆయనకి ఎమ్మెల్సీ స్థానం కేటాయించడంతో మద్దాల గిరికి సీటు కేటాయింపు ఖాయమనుకున్నారు. కానీ నియోజకవర్గంలో కులాల ఈక్వేషన్, సర్వే రిపోర్ట్‌లో మద్దాలికి అవకాశాలు తక్కువని చెబుతున్నారు. ఇదే సమయంలో తూర్పు సీట్‌పై క్లారిటీ ఇచ్చినప్పటికి పశ్చిమం సీటు విషయంలో మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతుందని అంటున్నారు.