MIM Plan :   మజ్లిస్  కలిసే పోటీ చేస్తున్నామని కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన సమయంలో ప్రకటించారు.    అయితే బీఆర్ఎస్ టిక్కెట్ల కేటాయింపుపై  మజ్లిస్ ఇంత వరకూ స్పందించలేదు.  కలిసే పోటీ చేస్తున్నామన్న కేసీఆర్ మాటలపైనా సైలెంట్ గా ఉన్నారు.    తెలంగాణ రాజకీయాల్లో మజ్లిస్ పాత్ర చాలా కీలకం. ఆ పార్టీకి కనీసం ఏడు స్థానాలు గ్యారంటీగా వస్తాయి.  అంతే కాదు ఆ పార్టీ తాను అనుకున్న పార్టీకి ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు వేయించగలదు.  ఇప్పటి వరకూ బీఆర్ఎస్‌తో లోపాయికారీ పొత్తులతోనే ఉన్నారు. తమ ఏడు సీట్లు.. హైదరాబాద్ పార్లమెంట్ లో తప్ప ఎక్కడా అభ్యర్థుల్ని నిలబెట్టడం లేదు. కానీ గత ఏడాదిన్నరగా జరిగిన పరిణామాలు చూస్తే మజ్లిస్ మరో ఆలోచనలో ఉన్నట్లుగా అర్థమవుతుంది.


బీఆర్ఎస్‌కు సహకరిస్తున్న ఎంఐఎం 
  
మజ్లిస్ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయి.  మజ్లిస్‌ పార్టీ పోటీ చేసిన నియోజకవర్గాలు తప్ప మిగతా సెగ్మెంట్లలో మజ్లిస్‌ ఓట్లతో పాటు ముస్లిం మైనారిటీల ఓట్లు కూడా బీఆర్‌ఎస్‌కే పడేవి.  తెలంగాణ రాజకీయాల్లో అటు బీఆర్ఎస్, ఇటు మజ్లిస్ పొత్తులు పెట్టుకోవు. కానీ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటాయి.  గత ఎన్నికల్లో కేసీఆర్ కు మజ్లిస్ పరోక్ష సహకారం ఎంతో లబించింది. ఎనిమిది చోట్ల తప్ప మజ్లిస్ ఇతర చోట్ల పోటీ చేయలేదు.  కొంత పాతబస్తీ కాలనీలు ఉండే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మాత్రం మజ్లిస్ పోటీ చేసింది.  కానీ ఆ ఒక్క చోట మాత్రమే ఓడిపోయింది.  అన్ని చోట్లా బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని తమ వర్గానికి సంకేతాలు పంపింది. దీంతో ముస్లిం వర్గం ఎక్కువ ఉన్న చోట్ల బీఆర్ఎస్ విజయం సులువు అయింది. 


పార్టీని విస్తరిస్తామని మజ్లిస్ ప్రకటనలు


అయితే ఇటీవలి కాలంలో తమ పార్టీని విస్తరించాలనుకుంటున్న మజ్లిస్... మరికొన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటిస్తోంది. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్,బోధన్, నిజామాబాద్ లాంటి చోట్ల అభ్యర్థుల్ని నిలబెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా ఆ పార్టీ నేతలు ప్రకటించారు. మజ్లిస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించడానికి అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయన పోటీ చేస్తున్నారు.  ఓట్ల శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోనూ ఆయన పట్టు పెంచుకోవాలని చూడకుండా ఉండరు. రాజకీయాల్లో ఎవరికైనా అంతిమ లక్ష్యం తాము బలపడటమే. పరస్పర ప్రయోజనాలు ఉన్నప్పుడే.. సహకారం తీసుకుంటారు. ఒక పార్టీకే ప్రయోజనం కల్పించే సహకారాలు రాజకీయాల్లో నిలబడవు. అందుకే పరస్పర ప్రయోజనం ఉంటేనే మజ్లిస్ సహకారానికి ఒప్పుకుంటుంది. బీఆర్ఎస్ సహకారం ఉన్నా లేకున్నా.. మజ్లిస్ సులువుగా ఏడు చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది. అంతకు మించిన ప్రయోజనం ఉంటే తప్ప సహకారం ఇవ్వరు. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఏదీ తొందరపాటుతో చేయరు. ప్రతీ దానికి ఓ లెక్క ఉంటుంది. ఇప్పుడే  బీఆర్ఎస్ తో అవగాహన... సీట్ల గురించి మాట్లాడటం ఆయనకు ఇష్టం ఉండదు.  ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత తాను చేయాలనుకున్న పని చేస్తారు.


కింగ్ మేకర్ అవ్వాలనేది మజ్లిస్ టార్గెట్ ! 


తెలంగాణలో ఎవరు గెలిచినా మజ్లిస్ పార్టీకి మాత్రం ఏడు అసెంబ్లీ స్థానాలు ఖాయం.   119 అసెంబ్లీ స్థానాల్లో ఏడు అంటే ఒక్కో సారి కింగ్ మేకర్ కావొచ్చు.  ఈ సారి మాత్రం ఏడు కాదు ఆ సంఖ్యను ఇంకా పెంచుకోవాలని  కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు పొందాలని అనుకుంటున్నారు  ఇటీవల బోదన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కు..  ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురు మజ్లిస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో పరామర్శకు మజ్లిస్ చీఫ్ నిజామాబాద్ వెళ్లారు.  అప్పుడు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌తో పొత్తు మాటే ఉండదన్నారు.   ముందు  మా క్రికెట్ బ్యాటింగ్ మేము ఆడతాము.. మా స్కోర్ మేము చూసుకుంటాం.. ఆపై ఎవరిని అవుట్ చేయాలి అనేది ఆలోచిస్తామని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.    కేసీఆర్ చెప్పారని ఆయన కొన్ని సీట్లకే పరిమితం అవ్వరు. తనకు రాజకీయంగా ప్రయోజనం లభిస్తుందని అనుకుంటేనే ఆ పని చేస్తారు. అందుకే మజ్లిస్ నిర్ణయంపై ఉత్కంఠ ఏర్పడుతోంది.