AP Power Problems :  అధికారంలో ఉన్న పార్టీ  ఎన్నికలకు వెళ్లే ముందు తీసుకునే జాగ్రత్తలు చాలా పక్కాగా ఉంటాయి. ముందుగా ప్రజలకు కనీస అవసరాల విషయంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటారు. అంటే కరెంట్, నీరు వంటివి. ఇందు కోసం పక్కా ప్రణాళికలు వేసుకుంటారు. ఎందుకంటే వీటిలో తేడా వస్తే ప్రజల ఆగ్రహం ఎక్కువగా కనిపిస్తుంది. అదే సమయంలో సంక్షేమపథకాలను సమయానికి అందించడమే కాదు.. అవసరం అయితే ఒకటి, రెండు ప్రారంభిస్తారు కూడా. అయితే ఈ రెండు విషయాల్లో ఏపీ ప్రభుత్వం ప్రణాళిక దారి తప్పినట్లుగా కనిపిస్తోంది. ఏపీలో పథకాలకు నిధులు ఆలస్యం కావడం.. వరుసగా కరెంట్ కోతలు విధించాల్సి వస్తూండటమే దీనికి కారణం. 


కరెంట్ కోతల వెనుక ప్రణాళిక లేకపోవడమే కారణం 


ఏపీలో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌కు తగ్గ అవసరాన్ని డిస్కంలు తీర్చలేకపోతున్నాయి. పరిశ్రమలకు అధికారికంగా పవర్ హాలీడే ్రకటించారు.  లోడ్‌ రిలీఫ్‌ పేరుతో  గృహ అవసరాలకూ కోతలు విధిస్తున్నారు.  లోడ్‌ రిలీఫ్‌ పేరుతో విధిస్తున్న అప్రకటిత కోతలతో ప్రజలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న  సందర్భాలు ఉన్నాయి. వర్షాలు లేకపోవడం వల్ల జల విద్యుత్ తగ్గిపోయింది. కానీ బొగ్గులు సరైన విధంగా అందబాటులో ఉంచుకుంటే.. కరెంట్ కొరత తలెత్తేది కాదు. తెలంగాణలో  ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.   థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అడుగంటాయి. నిబంధనల ప్రకారం 15 రోజులకు సరిపడ బొగ్గు అంటే ఉండాలి. కానీ రెండు, మూడు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు కూడా అందుబాటులో లేవు. బహిరంగ మార్కెట్‌లో కొనాలన్నా దొరకని పరిస్థితి. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. దీంతో కోతలు అనివార్యమయ్యాయి. ప్రజాగ్రహాన్ని చూడాల్సి వస్తోంది. 


పెరుగుతున్న ఆర్థిక సమస్యలు


ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఆరోనెల ప్రారంభం నడుస్తోంది. కానీ డబ్బులు లేకపోవడంతో జీతాలు, పెన్షన్లు సమయానికి ఇవ్వలేకపోయారు. కాపునేస్తం పథకానికి బటన్ నొక్కడానికి ఏర్పాట్లు చేసినా నొక్కలేకపోయారు. దీనికి కారణం నిధుల సమస్యే.  సంవత్సరంలో దాదాపుగా 11 నెలలు ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఓడీలోనే ఉంటోంది. ఎలాగోలా అప్పులు తెచ్చుకుని గట్టెక్కుతోంది. ఈ అప్పుల సంగతి పక్కన పెట్టినా.. సమయానికి బటన్ నొక్కుతున్నా అని సీఎం జగన్ నమ్మకంగా చెప్పేవారు. అయితే ఇప్పుడు ఆ బటన్ టైమింగ్ మిస్సవుతోది. కొన్ని సార్లు బటన్లు నొక్కినా నగదు జమ కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఇలాంటి పరిస్థితి లబ్దిదారుల్లో అనూమానాలను కలిగిస్తాయి. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరమే 


అధికార వ్యతిరేకత పెరగకుండా జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారా ?


అధికారంలో ఉండే ప్రతీ ప్రభుత్వానికి అధికార వ్యతిరేకత అన్న ఓ సమస్య ఉంటుంది. దాన్ని వీలైనంత వరకూ తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద ఎక్కువ దృష్టి పెట్టి అవే ఓట్లు తెచ్చి పెడుతుందని అనుకుంటున్నప్పుడు వాటి విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ అపరిమిత అప్పులు.. ఆర్థిక నిర్వహణ కారణంగా.. ఆ పథాకల విషయంలోనూ ప్రజల్లో అనుమానాలు కలిగేలా చేసుకుంటున్నారు. అందుకే వైసీపీ ఎన్నికలకు సన్నద్దత అంత పకడ్బందీగా లేదన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఇంకా సమయం మించిపోలేదు. తమ సామర్థ్యాన్ని ప్రజలకు చూపించి.. వారి సమస్యలను దూరం చేయడానికి అవకాశం ఉంది. కానీ.. అది అంత సులువు కాదని భావించవచ్చు.