Congress Election Committee: లోకసభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. ఎలాగైనా ఎన్డీయేను ఓడించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. ఆ దిశగా ప్రణాళిక రచిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు గ్రౌండ్‌ ప్రిప్రేర్‌ చేసుకుంటోంది. ఇందులో భాగంగా... 16 మందితో సెంట్రల్ ఎలక్షన్ కమిటీని ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. ఈ కమిటీలో AICC అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీతోపాటు ఆ పార్టీ నేతలు అధిర్‌ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్‌కు చోటు దక్కింది. తెలుగురాష్ట్రాల నుంచి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాత్రమే కమిటీలో చేర్చింది. 


కమిటీలోని మొత్తం 16 మంది సభ్యుల పేర్లు.. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంబికా సోనీ, అధిర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, టీఎస్ సింగ్ ఢియో, కేజే జార్జ్, ప్రీతమ్ సింగ్, మొహమ్మద్ జవెద్, అమీ యజ్నిక్, పీఎల్ పునియా, ఓంకార్ మార్కమ్, కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని ఏర్పాటు చేశారని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కాంగ్రెస్‌ నేత టీఎస్‌ సింగ్‌ డియో, ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ల పేర్లు కూడా కమిటీలో ఉన్నాయి. 


ఇటీవలే 84మందితో సీడబ్ల్యూసీని కూడా ప్రకటించింది కాంగ్రెస్‌ అధిష్ఠానం. ఈ84లో జీ23 గ్రూపు నాయకులైన శశిథరూర్, ఆనంద్ శర్మ కూడా ఉన్నారు. ఖర్గే AICC అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన 10 నెలల తర్వాత ఏర్పడిన CWCలో 39 మంది సాధారణ సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది  ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. వీరిలో 15 మంది మహిళలు. సాధారణ సభ్యులలో సచిన్ పైలట్, గౌరవ్ గొగోయ్ వంటి కొత్త ముఖాలు కూడా ఉన్నాయి.


ఈనెల 17న సీడబ్ల్యూసీ సమావేశం ఉంటుందని కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. ఈ సమావేశంలో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులంతా పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లో మెగా ర్యాలీ నిర్వహిస్తామని.. తెలంగాణకు ఐదు హామీలను ప్రకటిస్తామని వేణుగోపాల్ తెలిపారు. ర్యాలీ తర్వాత తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో... ప్రతి సీడబ్ల్యూసీ సభ్యుడు, ఆహ్వానితులు, పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలంతా పర్యటిస్తారని.. ఆ కార్యక్రమాన్ని అధ్యక్షుడు ఖర్గే జెండా ఊపి ప్రారంభిస్తారని చెప్పారు. ఇక సెప్టెంబరు 18న సిట్టింగ్‌ ఎంపీలతో పాటు నేతలంతా కలిసి కార్యకర్తల సమావేశం నిర్వహించి.. మరుసటి రోజు నుంచి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఛార్జ్‌షీటును ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు.