బీజేపీ ఎంపీ హర్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చాలని డిమాండ్ చేశారు.  తక్షణమే భారత రాజ్యాంగం నుంచి ఇండియా అన్న పదాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 'ఇండియా అనే పదాన్ని ఆంగ్లేయులు ఉపయోగించేవారన్న ఆయన....ఇండియా అనే పదానికి బదులు భారత్ అనే పేరును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. పేరు మార్పుపై రాజ్యాంగ సవరణ చేయాలని బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఇండియా అనే పదం బ్రిటిషర్లు తీసుకొచ్చారని... భారత్ అనే పదం మన సంస్కృతికి ప్రతీక అని గుర్తు చేశారు. 


మన దేశం పేరు భారతా ? ఇండియానా ? ఒక దేశానికి రెండు పేర్లు అవసరమా.. అని అన్నారు. బీజేపీ ఎంపీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయ్. ఇండియా అనే పేరు బ్రిటీష్ పాలకులు పెట్టారని... భారతదేశం అనే పేరును మనం పెట్టుకున్నదని తెలిపారు. ఇండియా పేరును భారత్ గా మార్చాలని.. ప్రపంచమంతా భారతదేశంగా పిలవాలని కోరారు. ఈ సెంటిమెంట్ అన్ని దేశంలోని ప్రాంతాలకూ ఉందన్న ఆయన... రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కూడా భారత్ అని పిలవాలని ఎప్పుడో చెప్పారని తెలిపారు. భారత్ అనేది అభిరుచితో నిండిన పదమని...ఇది సజీవ పదం అని అన్నారు. ఇది మనకు శక్తిని ఇస్తుందని, భక్తి భావం దానితోనే ముడిపడి ఉంటుందని కామెంట్ చేశారు. ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాదన్నారు.


కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పాటైన కూటమికి... I.N.D.I.A అన్న పేరు పెట్టారు. ఈ కూటమిలో 28 పార్టీలు ఉన్నాయ్. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీయూ, ఆర్జేడీ, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలతోపాటు మరి కొన్నిపార్టీలు ఉన్నాయ్. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. బిహార్, బెంగళూరు, ముంబైల్లో మూడు సమావేశాలు నిర్వహించాయ్. విపక్ష కూటమి I.N.D.I.A అని పేరు పెట్టుకోవడంతో కమలం పార్టీలో ఆందోళన మొదలైందన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. I.N.D.I.A కూటమి...భారత్‌ అని పెట్టుకుంటే ఆ పేరునూ మార్చేస్తారా ? ప్రశ్నించారు. రాష్ట్రపతి భవన్ సెప్టెంబరు 9న విందుకు ఆహ్వానాన్ని పంపిందన్న జైరామ్ రమేశ్...అందులో ప్రెసిడెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉందన్నారు. భారతదేశం, అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుందని...యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం దాడికి గురవుతోందన్నారు. 


బీజేపీ సర్కార్‌ను గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకం కావడంతో....ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తమిళనాడు సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల ఐక్యతలో ఉన్న బలాన్ని గుర్తించిన బీజేపీకి ఇండియా అనే పదం టెన్షన్ పెడుతోందన్నారు దేశం పేరు మార్చడానికి  అధికార పార్టీ ఎందుకింత కంగారుపడుతోందో అర్థం కావట్లేదన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్. దేశం పేరు మార్చే అధికారం ఎవరికి లేదని స్పష్టం చేశారు. దేశం పేరులో ఇంగ్లీష్ లో ఇండియా అని...భారత్ అని అంటామన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దేశం పేరును మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్న దీదీ... ప్రపంచమంతటికి ఇండియాగా తెలుసన్నారు.