బంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో జరిగిన హింసాకాండపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది కలకత్తా హైకోర్టు. ఏప్రిల్ 7లోపు దర్యాప్తు పురోగతి నివేదికను అందజేయాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు, అరెస్ట్ చేసిన వ్యక్తులను సీబీఐకు అప్పగించాలని బంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు కోర్టు తెలిపింది.
దారుణం
బీర్భూమ్ జిల్లా రాంపుర్ హట్ పట్టణానికి సమీపంలో ఉన్న బగ్టుయి గ్రామంలో దుండగులు మంగళవారం హింసాకాండకు పాల్పడ్డారు. ఓ ఇంటిలో ఉన్న ఎనిమిది మందిని సజీవ దహనం చేశారు. అంతకుముందు వీరిని తీవ్రంగా కొట్టినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఈ హింసాకాండలో దాదాపు 12 ఇళ్ళను తగులబెట్టారు. టీఎంసీ నేత భడు షేక్ హత్యానంతరం ఈ హింసాకాండ జరిగింది.
ఈ కేసులకు సంబంధించి పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. షేక్‌ను హత్య చేయడానికి బాంబు దాడి చేసిన వ్యక్తి కూడా అరెస్టయిన వారిలో ఉన్నాడు. ఈ హింసాకాండలో మరణించినవారి మృతదేహాలకు నిర్వహించిన పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం, మొదట వీరిని తీవ్రంగా కొట్టి, హింసించి, ఆ తర్వాత సజీవ దహనం చేసినట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలలు ఉన్నారు.
పరిహారం
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను సీఎం మమతా బెనర్జీ గురువారం పరామర్శించారు. ఈ ఘటనలో మృతి చెందిన 8 మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామన్నారు. అంతేకాకుండా ఒక్కొక్క కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మృతుల్లో ఇద్దరు బాలలు కూడా ఉండటంతో వీరికి అదనంగా రూ.50,000 చొప్పున పరిహారం చెల్లిస్తామని దీదీ అన్నారు. దుండగులు దహనం చేసిన ఇళ్ళను పునర్నిర్మించుకోవడానికి రూ.2 లక్షలు చొప్పున ఇస్తామన్నారు.
Also Read: Ideas of India: ABP 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సదస్సు ప్రారంభం- సరికొత్తగా ఆలోచిద్దాం రండి!