Indo-China Relations: 2020 మే నెలలో భారత్, చైనా మధ్య తూర్పు లడఖ్ ప్రాంతంలో వివాదం నెలకొన్న తర్వాత తొలిసారి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం సాయంత్రం భారతదేశానికి వచ్చాయి. యీ రేపు ఉదయం 11 గంటలకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ మంత్రి డా. ఎస్ జైశంకర్‌లను కలిసే అవకాశం ఉందని ANI  తెలిపింది. వాంగ్ యీ కాబూల్ నుంచి న్యూదిల్లీకి వచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి ఉప ఖండపు దేశాల్లో పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మాస్కోకు చైనా ఆర్థికంగా సాయం అందిస్తుందని యూఎస్ సహా యూరోపియన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదని విశ్లేషణకులు అంటున్నారు. 






లడఖ్ ఉద్రిక్తల తగ్గించేందుకు ఇరు విదేశాంగ మంత్రుల భేటీ


PTI ప్రకారం వాంగ్ యీ భారత్ పర్యటన ప్రతిపాదన చైనా వైపు నుంచి వచ్చిందని తెలుస్తోంది. వాంగ్ నాలుగు దేశాల పర్యటనలో భాగంగా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకు కూడా వెళ్లనున్నారు. ఏడాదిన్నత క్రింత తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలను తగ్గించడానికి జైశంకర్, వాంగ్ యీ మాస్కో, దుషాన్‌బేలో అనేక రౌండ్ల చర్చలు జరిపారు. సెప్టెంబరు 2020లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మేళనం సందర్భంగా జైశంకర్, వాంగ్ మాస్కోలో విస్తృతమైన చర్చలు జరిపారు. ఈ సమయంలో వారు తూర్పు లడఖ్ సరిహద్దు వివాదం పరిష్కరించడానికి ఐదు పాయింట్ల ఒప్పందానికి వచ్చారు. ఈ ఒప్పందంలో ఇరు దేశాల దళాలను త్వరగా ఉపసంహరించుకోవడం, ఉద్రిక్తతలను పెంచే చర్యలను నివారించడం, సరిహద్దు నిర్వహణపై అన్ని ఒప్పందాలు, ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండటం, LAC వెంట శాంతిని పునరుద్ధరించే చర్యలు వంటి చర్యలు ఉన్నాయి. గత ఏడాది జులైలో తజికిస్థాన్ రాజధాని దుషాన్‌బేలో సరిహద్దు వివాదంపై ఇద్దరు విదేశాంగ మంత్రులు ద్వైపాక్షిక సమావేశాన్ని కూడా నిర్వహించారు. మళ్లీ సెప్టెంబర్‌లో దుషాన్‌బేలోనే చర్చలు జరిపారు. 


ఇరువైపులా 60 వేల మంది సైనికులు 


ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి వాస్తవాధిన రేఖ (LAC) వెంబడి శాంతి కీలకమని భారత్ గట్టిగా నమ్ముతోందని విదేశాంగశాఖ తెలిపింది. మార్చి 11న, తూర్పు లడఖ్ ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి భారతదేశం, చైనా 15వ రౌండ్ ఉన్నత స్థాయి సైనిక చర్చలు నిర్వహించాయి. మే 5, 2020న పాంగ్ యాంగ్ సరస్సు ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత భారత్ చైనా మిలిటరీల మధ్య తూర్పు లడఖ్ సరిహద్దు ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరుపక్షాలు పదివేల మంది సైనికులతో పాటు భారీ ఆయుధాలు మోహరించాయి. సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా, పాంగ్ యాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాలు, గోగ్రా ప్రాంతంలో సైనికులను వెనక్కి పిలిచాయి రెండు దేశాలు. సున్నితమైన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వెంబడి ప్రస్తుతం 50,000 నుంచి 60,000 మంది సైనికులు ఉన్నారు.