Himanta Biswa Sarma:
మీడియాని బ్యాన్ చేయడంపై ఆగ్రహం..
I.N.D.I.A కూటమి 14 న్యూస్ యాంకర్‌లపై నిషేధం విధించడంపై పెద్ద ఎత్తున వాదనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ తీరు ఇదే అంటూ బీజేపీ ఇప్పటికే మండి పడుతోంది. మీడియాని నిషేధించడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తు చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. మీడియాపై నిషేధం విధించడం పిల్లలాటగా ఉందని, కాంగ్రెస్‌కి ఇదేం కొత్త కాదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీడియాపై సెన్సార్ విధిస్తారని హెచ్చరించారు. 1975 నాటి రోజుల్ని కాంగ్రెస్ మరోసారి గుర్తు చేస్తోందని అన్నారు.
"మీడియాని బైకాట్ చేయడం చూస్తుంటే 1975 నాటి ఎమర్జెన్సీ రోజులు గుర్తొస్తున్నాయి. కాంగ్రెస్‌కి ఇదేం కొత్త కాదు. గుర్తుంచుకోండి. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా మీడియాపై ఆంక్షలు విధిస్తుంది. సెన్సార్‌షిప్‌తో అణిచివేస్తుంది"
- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి
కాంగ్రెస్‌పై సెటైర్లతో విరుచుకు పడ్డారు హిమంత. ఇస్రో సరైన సమయంలో చంద్రయాన్ ప్రయోగం చేసిందని, కాంగ్రెస్‌ని అందులో పెట్టి చంద్రుడిపైకి పంపిస్తే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
"ఇస్రో సరైన సమయానికి చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగించింది. కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని చంద్రుడిపైకి పంపించేస్తాను. అక్కడైనా వాళ్లు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు"
- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి
క్లారిటీ ఇచ్చిన విపక్ష కూటమి..
ఇటీవలే విపక్ష కూటమి తాము బ్యాన్ చేస్తున్న 14 న్యూస్ ఛానల్స్ లిస్ట్‌ని విడుదల చేసింది. ఈ బ్యాన్ విధించడంపై వివరణ ఇచ్చారు కూటమి నేతలు. వాళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, విద్వేషాలు ప్రచారం చేస్తున్నారని అందుకే నిషేధించాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు. తమ కూటమి నేతలు ఆయా ఛానల్స్‌కి ఇంటర్వ్యూలకు వెళ్లరని, ఆ ప్రతినిధులనూ తమ కార్యక్రమాలకి పిలవబోమని క్లారిటీ ఇచ్చారు. ఇది నిషేధం కాదని, కేవలం దూరం పెట్టడం మాత్రమేనని చెప్పారు. ఒకవేళ వాళ్లు పక్షపాతంగా కాకుండా ఉన్నది ఉన్నట్టు రిప్రజెంట్ చేస్తే కచ్చితంగా ఈ నిషేధం ఎత్తివేస్తామని అన్నారు.
"మేం ఏ మీడియా ఛానల్‌నీ బైకాట్ చేయలేదు. వాళ్లు మాకు సరైన విధంగా సహకరించడం లేదు. పక్షపాతంగా వార్తలు రాస్తున్నారు. విద్వేషాలు ప్రచారం చేస్తున్నారు. మాకు వాళ్లేం శత్రువులు కాదు. ఈ నిర్ణయ ఏమీ శాశ్వతం కాదు. వాళ్లు తీరు మార్చుకుంటే కచ్చితంగా ఈ నిషేధం ఎత్తేస్తాం"
- పవన్ ఖేరా, కాంగ్రెస్ ప్రతినిధి
బీజేపీ ప్రతినిధులు మాత్రం విమర్శలు ఆపడం లేదు. దేశంలోని ప్రతి సంస్థపైనా విపక్ష కూటమి దాడి చేస్తోందని, ఇప్పుడు మీడియా విషయంలోనూ టార్గెట్ లిస్ట్ తయారు చేసుకుందని మండి పడుతున్నారు.
Also Read: తమిళనాడు తెలంగాణల్లో NIA సోదాలు, భారీ ఉగ్రకుట్ర భగ్నం - పలువురి అరెస్ట్