Watch Video: 


రైల్వే కూలీలతో ముచ్చట్లు..


రాహుల్ గాంధీ ఈ మధ్య ప్రచారం స్టైల్ మార్చేశారు. భారత్ జోడో యాత్ర తరవాత ఈ మార్పు కనిపిస్తోంది. ఎక్కువగా జనాల్లోనే ఉంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా ప్రజలతో కలిసిపోతున్నారు. ఢిల్లీలోని రైల్వే స్టేషన్‌ వద్ద రైల్వే కూలీలను కలిశారు రాహుల్ గాంధీ. వాళ్లతో చాలా సేపు మాట్లాడారు. ఆ తరవాత పోర్టర్ డ్రెస్ వేసుకున్నారు. బ్యాడ్జ్ కూడా పెట్టుకున్నారు. అంతే కాదు. కూలీలా ఓ సూట్‌కేసుని కూడా మోశారు రాహుల్. ఆనంద్ విహార్ స్టేషన్‌ వద్ద ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. చుట్టూ వందలాది మంది కూలీలు సందడి చేశారు. 





ఈ ఏడాది ఆగస్టులోనూ రాహుల్ ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీకి వెళ్లారు. అక్కడ పండ్లు, కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను కలిసి మాట్లాడారు. కూరగాయల ధరలు పెరుగుదలపై మాట్లాడేందుకు వెళ్లారు. జులైలో ఢిల్లీ నుంచి షిమ్లాకు వెళ్తున్న సమయంలో హరియాణాలోని రైతులను కలిశారు రాహుల్. పొలంలోకి దిగి రైతులతో మాట్లాడారు. వారితో పాటు నాట్లు కూడా వేశారు. ట్రాక్టర్‌తో దున్నారు. రైతు కూలీలతోనూ మాట్లాడారు. 


మహిళా రిజర్వేషన్ బిల్‌పై..


మహిళా రిజర్వేషన్ బిల్లు అంసపూర్తిగా ఉందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. నారీ శక్తి వందనం బిల్లులో ఓబీసీ రిజర్వేషన్ ను కూడా చేర్చాలని కోరుకుంటున్నట్లు రాహుల్ తెలిపారు. ఓబీసీ రిజర్వేషన్ ప్రస్తావన లేదని, దాని వల్ల మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్తిగా ఉందని ఆయన అన్నారు. దేశ మహిళలకు పంచాయతీ రాజ్ అతి పెద్ద ముందడుగుగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. దేశంలోని మహిళలను రాజకీయాల వైపు మళ్లించడంలో, అధికారాలను బదిలీ చేయడంలో అతిపెద్ద ముందడుగు పంచాయతీరాజ్ అని, ఆ వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 


Also Read: కెనడాలో భారత వీసా సర్వీస్‌లపై ఆంక్షలు, వీసా అప్లికేషన్ సెంటర్ అధికారిక ప్రకటన