Women's Reservation Bill 2023: మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసేందుకు కేంద్రం వడివిడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే జనాభా గణన చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్నికల తర్వాత మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు చేసేందుకు జనాభా గణన చేట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అమిత్‌ షా ప్రకటించారు. బిల్లు అమలులో జాప్యం జరుగుతుందనే భయాందోళనలు అవసరం లేదని, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం డీలిమిటేషన్‌ను చేపడుతుందని ఆయన చెప్పారు.


నిష్పక్షపాతంగా సీట్ల కేటాయింపు
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలును వ్యతిరేకిస్తున్న వారిపై అమిత్ షా విమర్శలు ఎక్కుపెట్టారు. ఖచ్చితంగా 1/3 వంతు సీట్లు మహిళా ఎంపీలకు రిజర్వ్ చేయబడతాయని, నిష్పక్షపాతంగా సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఓబీసీలు, ముస్లింలకు రిజర్వేషన్లు లేనందున ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని కొందరు సోషల్ మీడియాలో చెబుతున్నారని, మీరు ఈ బిల్లుకు మద్దతివ్వకపోతే రిజర్వేషన్లు త్వరగా వస్తాయా? అంటూ ప్రశ్నించారు. మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా రిజర్వేషన్ల అమలుకు గ్యారంటీ ఉంటుందన్నారు. 


డీలిమిటేషన్ కోసం ప్రత్యేక కమిషన్
ఎన్నికల అనంతరం వీలైనంత త్వరగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతామన్నారు. ఇందుకోసం ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఎన్నికల కమిషన్ ప్రతినిధి, ప్రతి రాజకీయ పార్టీ నుంచి ఒక ప్రతినిధి, చట్టం ప్రకారం డీలిమిటేషన్ కమిషన్‌లో భాగం అవుతారని అమిత్ షా అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడాన్ని సమర్థిస్తూ.. దేశంలో నిర్ణయాధికారం, విధాన రూపకల్పనలో మహిళల భాగస్వామ్యాన్ని ఈ బిల్లు నిర్ధారిస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం, జనాభా గణన పూర్తయిన తర్వాత లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరుగుతుంది. దాని తరువాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుందన్నారు.


ఇదేం తొలిసారి కాదు
మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం ఇదే తొలిసారి కాదని అమిత్ షా అన్నారు. మహిళా బిల్లు తీసుకురావడానికి ఇది ఐదో ప్రయత్నం అన్నారు. దేవెగౌడ నుంచి మన్మోహన్ సింగ్  వరకు నాలుగు సార్లు ఈ బిల్లును తీసుకురావడానికి ప్రయత్నించారని అన్నారు. అయినా ఈ బిల్లు ఆమోదం పొందకపోవడానికి కారణం ఏంటని అమిత్ షా ప్రశ్నించారు. భారతదేశంలోని 90 మంది కార్యదర్శులలో 3 OBCలు ఉన్నారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా ఖండించారు. కొంతమంది సెక్రటరీలు దేశాన్ని నడుపుతారని అనుకుంటారని, కానీ తాను ప్రభుత్వం దేశాన్ని నడుపుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. 85 మంది బీజేపీ ఎంపీలు ఓబీసీలు అని, 29 మంత్రి ఓబీసీ వర్గానికి చెందిన వారు మంత్రులు ఉన్నారని అన్నారు. చివరగా, మహిళా కోటా బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని అమిత్ షా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. లోటుపాట్లు ఉంటే తర్వాత సరిదిద్దుకోవచ్చని చెప్పారు.


మహిళా బిల్లుకు అనుకూలంగా 454 మంది ఎంపీల ఓట్లు
మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 454 మంది లోక్ సభ సభ్యులు ఓటు వేయగా, ఇద్దరు ‘నో’ అని ఓట్ చేసినట్లుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేశారు. వారిలో ఒకరు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఔరంగాబాద్ ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఉన్నారు. కొత్త పార్లమెంటు భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు, పాసైన తొలి బిల్లు ఇదే కావడం విశేషం. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలు లాంటి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే ఈ బిల్లుకు సుమారు 27 ఏళ్ల తర్వాత మోక్షం లభించింది. కానీ, డీలిమిటేషన్‌ తర్వాతే మహిళలకు రిజర్వేషన్‌ కోటా అమలుకానుంది. దీంతో లోక్‌సభలో మహిళల సీట్ల సంఖ్య 181కు పెరగనుంది.