New Rules Over Flight Delays: ఢిల్లీ: పొగమంచు, ఇతరత్రా సాంకేతిక కారణాలతో దేశ వ్యాప్తంగా పలు ఎయిర్ పోర్ట్‌లలో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. విమానాల ఆలస్యం, రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ప్రయాణికుడు విమాన కెప్టెన్ పై సైతం దాడి చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దేశంలోని 6  మెట్రో నగరాల్లో ‘వార్‌ రూమ్స్‌’ (War Rooms At Airports) ఏర్పాటు చేయనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఇప్పటికే విమానాల ఆలస్యంపై ఎయిర్‌లైన్లకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు తాజాగా మరికొన్ని చర్యలు చేపట్టింది. తెలిసిందే. ప్రతికూల వాతావరణం కారణంగా 3 గంటలకు మించి లేట్ అవుతుందనుకుంటే ఆ విమానాన్ని ముందస్తుగా రద్దు చేయవచ్చని అన్ని ఎయిర్ లైన్స్‌కు డీజీసీఏ స్పష్టం చేసింది.


సోమవారం ఢిల్లీలో పొగమంచు కారణంగా కొన్ని గంటలపాటు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. పరిస్థితిని అర్థం చేసుకుని క్యాట్ 3లో నాల్గవ రన్ వేను అదనంగా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఏది ఏమైనా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చారు. దేశంలోని అన్ని విమానయాన సంస్థలకు నిర్ణీత మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపిన ఆయన.. కచ్చితంగా పాటించాల్సిన కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ కార్యాచరణ పాటిస్తే ప్రయాణికులకు అసౌకర్యం కలగదని, వారికి సత్వరమే వివరాలు, పరిస్థితిని వివరించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 






కేంద్రం తాజాగా ప్రకటించిన మార్గదర్శకాలివే (Standard Operating Procedures)
- దేశంలో రద్దీ అధికంగా ఉండే 6 మెట్రో ఎయిర్‌పోర్టులైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులలో జరిగే సంఘటలను ప్రతిరోజూ మూడుసార్లు కేంద్రానికి రిపోర్ట్ చేయాలి.
- డీజీసీఏ మార్గదర్శకాలు, నిబంధనల అమలును నిరంతరం పర్యవేక్షిస్తారు. వీటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనునన్న కేంద్రం 
- పైన పేర్కొన్న 6 మెట్రో ఎయిర్ పోర్టులలో ఎయిర్‌లైన్‌ ఆపరేటర్లు ‘వార్‌ రూమ్స్‌’ను ఏర్పాటు చేయాలి. ఈ వార్ రూమ్స్ ఆ విమానాశ్రయంలో ప్రయాణికులకు కలిగే అసౌకర్యం, సమస్యలకు తక్షణ పరిష్కారాన్ని చూపిస్తాయి. 
- ఎయిర్ పోర్టుల్లో 24 గంటలపాటు తగినంత సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని అందుబాటులో ఉండేలా చూస్తామని ప్రకటన 
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని RWY 29ఎల్‌ రన్‌వేపై మంగళవారం (జనవరి 16) నుంచి కేటగిరీ 3 ఆపరేషన్స్‌ను అందుబాటులోకి తెచ్చాం. 
- జీ20 సదస్సు అనంతరం మూసివేసిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లోని పాత రన్ వేను త్వరలోనే అందుబాటుకి తీసుకురానున్నాం. కేటగిరి 3 కిందకు వచ్చే RWY 29Lను మెయింటనెన్స్ పనుల కారణంగా ప్రస్తుతం వినియోగించడం లేదని స్పష్టం చేశారు.


ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన..
కొందరు ప్రయాణికులు కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని, విమానాలు మరింత ఆలస్యమైతే తమకు వసతి, ఆహారం లాంటి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. మరికొందరు ప్రయాణికులు కేంద్ర మంత్రి నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రం చర్యలు అంటూ ట్వీట్లు చేస్తే సరిపోతుందా.. అధికారిక వెబ్ సైట్‌లో ఎప్పుడు అప్‌లోడ్ చేస్తారు సార్ అంటూ ప్రశ్నించారు. గతంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, ఎందుకు చర్యలు తీసుకోలేదని ట్వీట్లు చేస్తున్నారు.