Viral Video: పశ్చిమ బెంగాల్ లో మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఎంసీ అధినేత, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్పాయిగురి మల్బజార్ ప్రాంతంలోని రోడ్డు పక్కన టీ స్టాల్ లో ఛాయ్ తయారు చేసి అందరికీ అందిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


3.59 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను ఏఎన్ఐ వార్తా ఏజెన్సీ ట్వీట్ చేసింది. ఇందులో మమతా బెనర్జీ మొదట టీ కప్పులు తీసి ఓ పద్ధతిగా పరిచారు. ఆలోపు పక్కనే ఉన్న మహిళ టీ తయారు చేసి దీదీకి అందించారు. ఆమె ఆ కప్పుల్లో టీ నింపి అందిరికీ అందించారు. ఆ తర్వాత టీ స్టాల్ యజమాని కుటుంబసభ్యులతో కాసేపు మచ్చటించారు. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జిల్లా పరిషత్ లు, పంచాయతీ సమితి, గ్రామ పంచాయతీల్లో దాదాపు 75 వేల మంది అభ్యర్థులను ఎన్నుకునేందుకు దాదాపు 5.67 కోట్ల మంది ఓటర్లు ఈ పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో జూలై 8వ తేదీన పోలింగ్ జరగనుంది. జులై 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.






గతంలో పకోడా అమ్మిన మమతా బెనర్జీ


గత ఏడాది నవంబరులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీధి వ్యాపారిగా అవతారమెత్తారు. ఝర్‌గ్రామ్ లోని అంధారియా గ్రామ సమీపంలో ఓ టీ స్టాల్ లో పకోడాలు వడ్డించారు. వాటిని ఓ న్యూస్ పేపర్ లో చుట్టి కస్టమర్లకు అందించారు. గతంలో దీదీ పకోడాలు అమ్మిన వీడియో వైరల్ అయింది. 






డార్జిలింగ్ లో పానీపూరీ అమ్మిన దీదీ


సీఎం గా విజయం సాధించిన అనంతరం డార్జిలింగ్ లో మూడు రోజుల పాటు పర్యటించారు మమత బెనర్జీ. ఈ సందర్భంగా గుర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడానికి హిల్ స్టేషన్ కు వెళ్లారు. ఈ క్రమంలో దీదీ డార్జిలింగ్ లోని మాల్ రోడ్డులో ఉన్న పానీ పూరీ దుకాణాన్ని సందర్శించారు. కస్టమర్లకు తానే స్వయంగా పానీ పూరి వడ్డించారు. ఇలా మమతా బెనర్జీ వీధి వ్యాపారుల అవతారం ఎత్తిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతకుముందు ఒకసారి డార్జిలింగ్ లోని ఓ చిన్న స్టాల్ లో మోమోలు తయారు చేశారు. మరో సందర్భంలో మహిళలు నిర్వహించే స్టాల్ ను సందర్శించి పుచ్కా తయారు చేసి అందించారు.