Viral News: రోజురోజుకూ మానవత్వం మంట కలుస్తోంది. తాము కన్నవాళ్లు, తమను కన్నవాళ్ల కంటే కూడా వస్తువులపై మోజు పెరిగిపోతుంది. ఇంట్లో వాళ్లు చూపించే ప్రేమ కంటే సామాజిక మాధ్యమాల్లో వచ్చే లైకులు, కామెంట్లు, షేర్లే ముఖ్యమనుకునే వాళ్లు కోకల్లలు. అలాంటి కోవలోకే వస్తుందీ జంట. ఆ దంపతులకు రీల్స్ అంటే మోజు. అవి చేసేందుకు తమ వద్ద మంచి ఫోన్ లేదు. ఐఫోన్ కొనాలని ఎంతో కాలంగా చూస్తున్నారు. కానీ అందుకు తమ వద్ద డబ్బు లేదు. ఈక్రమంలోనే తమ 8 నెలల కుమారుడిని అమ్మేస్తే డబ్బులు వస్తాయని.. వాటితో ఐఫోన్ కొని ఫుల్లుగా రీల్స్ చేసుకోవచ్చని ప్లాన్ వేశారు. వెంటనే బాబును అమ్మేసి ఫోన్ కొన్నారు. తల్లి ఒడిలో కూర్చొని ఆడుకోవాల్సిన ఆ బాబును వెంటనే మర్చిపోయిన ఆ తల్లిదండ్రులు... ఎంచక్కా రాష్ట్రమంతా తిరుగుతూ రీల్స్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ విషయం  వెలుగులోకి వచ్చింది. 


పశ్చిమ బెంగాల్ లోని పానిహతి గాంధీ నగర్ కు చెందిన జయదేవ్, సాథి దంపతులు. వీరికి ఏడేళ్ల కుమార్తె, 8 నెలల కుమారుడు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా వీరి బాబు కనిపించడం లేదు. స్థానికులంతా వీరిని బాబు ఎక్కడని అడిగారు. పొంతన లేని సమాధానాలు చెబుతూనే ఎప్పుడూ ఊర్ల చుట్టూ తిరుగుతున్నారు. దానికి తోడు రీల్స్ చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. వీరి వ్యవహారం తేడాగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జయదేవ్, సాథిని విచారించారు. ఈక్రమంలోనే ఐఫోన్ కొనడం కోసం డబ్బుల్లేక బాబును అమ్ముకున్నట్లు తెలిపారు. ఈ మాట విన్న పోలీసులు నిర్ఘాంతపోయారు. వారిపై కేసు నమోదు చేసి పిల్లాడిని ఎవరికి అమ్మారు, ఎంతకు అమ్మారు అని తెలుసుకుంటున్నారు. 


జయదేవ్ తండ్రి మాట్లాడుతూ.. బాబును సాథి పుట్టింటికి పంపినట్లు మాత్రమే తనకు తెలుసని చెప్పారు. కానీ ఆ తర్వాత చాలా రోజులకు బాబును అమ్మేసినట్లు తెలిసిందని అన్నారు. వారిని నిలదీద్దామనుకుంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి విహార యాత్రకు వెళ్లారని అన్నారు. గతంలో కొడుకు, కోడలు తనను కూడా మానసికంగా, శారీరకంగా వేధించారని.. అనేక సార్లు దాడి కూడా చేశారని అన్నారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial