ఉడిపిలోని ఒక ప్రైవేట్ పారామెడికల్ కళాశాల వాష్‌రూమ్‌లో "సీక్రెట్ కెమెరాలు" ఉన్నాయనే వాదనలను జాతీయ మహిళా కమిషన్ (NCW) సభ్యురాలు, BJP నాయకురాలు ఖుష్బు సుందర్ గురువారం తోసిపుచ్చారు. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా కాలేజ్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఉడిపి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అక్షయ్ హకే మచ్చింద్రా, ఇతర అధికారులతో కలిసి జాతీయ మహిళా కమిషన్ బృందం ఉడిపిలోని నేత్ర జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌ని సందర్శించారు. సీక్రెట్ కెమెరాల విషయంపై దర్యాప్తు చేయడానికి సహకరించాలని యాజమాన్యానికి సూచించారు. మరుగుదొడ్లలో రహస్య కెమెరాలు ఉన్నాయని వచ్చిన వదంతుల్లో వాస్తవం లేదన్నారు. కావాలనే దుష్ప్రచారం చేస్తూ తప్పుడు వీడియోలు, సంబంధం లేని నకిలీ వీడియోలు వైరల్ చేస్తున్నారని ఖుష్బు అన్నారు. ఇది ఒక సంస్థని అక్కడ రహస్య కెమెరాలు ఉండవని ఆమె చెప్పారు.
వివాదంపై పోలీసులతో మాట్లాడుతున్నామని, పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి, తమ వైపు నుంచి విచారణ కొనసాగుతుందని, అతి త్వరలో ఒక నిర్ధారణకు వస్తామని ఖుష్బూ తెలిపారు. సస్పెండైన ముస్లిం విద్యార్థులు జిహాదీ కుట్రలో భాగంగా హిందూ బాలికల ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించారని, వాటిని ముస్లిం పురుషులకు పంపడానికి కుట్ర చేస్తున్నారని వివాదం చెలరేగిన నేపథ్యంలో ఖుష్బు ఉడిపిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మతంతో సంబంధం లేకుండా మహిళలకు రక్షణ కల్పించడంపై కమిషన్ దృష్టి సారించిందని, ఈ ఘటనను మతపరమైన కోణంలో చూడొద్దని ప్రజలను కోరారు.
జాతీయ మహిళా కమిషన్, పోలీసులు తమ పనిని శ్రద్ధగా చేస్తున్నారని ఆమె అన్నారు. NCW మహిళల రక్షణకు కట్టుబడి ఉందని, ఏ మత కోణాన్ని దృష్టిలో ఉంచుకుని పని చేయదన్నారు. దీనిపై ఉడిపి పోలీసుల సైతం స్పందించారు. ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని కొట్టిపారేశారు. ఈ సంఘటనకు సంబంధించి చాలా మంది సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, వదంతులను షేర్ చేస్తున్నారని, ఇది వారు ఏదో ఒక ఉద్దేశ్యంతో చేస్తున్నాని ఉడిపి పోలీసు సూపరింటెండెంట్ అక్షయ్ మచ్చింద్ర స్పష్టం చేశారు. హిందూ విద్యార్థులే లక్ష్యంగా రహస్య కెమెరాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయని తమ సమాచారం ప్రకారం, ఈ కేసులో అలాంటిదేమీ ఉపయోగించలేదని ఆయన వివరించారు.
ఈ ఘటనపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారనే ఆరోపణలతో మాల్పే పోలీసులు బుధవారం చౌహాన్‌పై కేసు నమోదు చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించేలా చౌహాన్ ఎడిట్ చేసిన వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఉడిపి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చౌహాన్ పోస్ట్‌ను తొలగించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియో వాస్తవానికి 13/7/23న చెన్నైకి చెందిన ‘తమిళ జైలర్’ అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి వచ్చిందని, ఈ వీడియో ఉడిపిలో జరిగిన ఘటనగా చిత్రకరించేందుకు నేపథ్యంలో కన్నడలో వాయిస్‌తో మిక్సింగ్ చేశారని ఎస్పీ వివరించారు. ఈ వీడియోకు ఉడిపిలో జరిగిన ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ సోమవారం ట్వీట్ చేశారు.