రైల్వే శాఖ అందిస్తున్న ఆహారంలో నాణ్యత ప్రమాణాల లోపం కనిపిస్తోంది. తరచూ ఎక్కడో చోట అపరిశుభ్రమైన, నాణ్యత లేని ఆహారంపై ప్రయాణికులు వినియోగదారులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కోలకతాలోని రాజధాని ఎక్స్ ప్రెస్‌లో ఆహారంలో బొద్దింక వచ్చిన సంగతి తెలిసిందే. గత నెలలో ఉత్తర ప్రదేశ్‌లో ఓ ప్రయాణికుడికి ఐఆర్‌సీటీసీ అందించిన భోజనంలో బొద్దింక వచ్చింది. తరచూ ఇలాంటి ఘటనలతో ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజాగా ఇలాంటి ఘటననే జరిగింది. ఈ జులై 24న భోపాల్ నుంచి గ్వాలియర్ వెళుతున్న రైల్లో ఈ ఘటన వెలుగు చూసింది. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో ప్రయాణిస్తూ IRCTC అందించిన ఆహారం చూసి ఓ వ్యక్తి షాకయ్యాడు. అతనికి వచ్చిన చపాతీల్లో ఒకదానికి బొద్దింక అంటుకుని కనిపించింది. ఆందోళనకు గురైన వ్యక్తి ఆహారంలో ఉన్న బొద్దింకను ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆహారం నాణ్యతపై ఐఆర్‌సీటీసీని ప్రశ్నించాడు.
ఈ నెల 24న ఓ ప్రయాణికుడు భోపాల్ నుంచి గ్వాలియర్‌కు వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో బయల్దేరాడు. మార్గమధ్యలో ఆకలిగా ఉండడడంతో చపాతి ఆర్డర్ ఇచ్చాడు. వచ్చిన ఆహారంలో ఒక చపాతికి చనిపోయిన బొద్దింక అంటుకుని కనిపించింది. IRCTC అందిస్తున్న ఆహారంలో నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఇలాంటి ఆహారం ఎంత వరకు ఆరోగ్యకరమంటూ ప్రశ్నించాడు. బొద్దింక ఉన్న చపాతిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్టు వైరల్ అవుతోంది. చాలా మంది అతనికి మద్దతు తెలిపారు. ఇదే మార్గంలో ప్రయాణించిన చాలామంది కలుషిత ఆహారం విక్రయిస్తున్నారని, ఆరోగ్యాలు పాడు చేస్తున్నారని కామెంట్లు చేశారు. దీనిపై IRCTC స్పందించింది.
దీనిపై రైల్వే వెంటనే స్పందించింది. ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పిన రైల్వే శాఖ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామంది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. పీఎన్ఆర్ నెంబర్, ఇతర వివరాలను నేరుగా మెసేజ్ చేస్తే తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇలాంటి ఘటనలను అస్సలు సహించబోమని ఐఆర్‌సీటీసీ పేర్కొంది. ప్రయాణికుడికి ఐఆర్‌సీటీసీ ఆ తరువాత మరో పార్శిల్‌ను ఏర్పాటు చేసినట్టు భోపాల్ డివిజన్ రైల్వే మేనేజర్ తెలిపారు. ఆహార సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
గత నెలలో ఉత్తర ప్రదేశ్‌లో..
గత జూన్ నెలలో ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ రైలు ప్రయాణికుడికి ఐఆర్‌సీటీసీ అందించిన ఆహారంలో బొద్దింక వచ్చింది. ఆలూ కూరలో బొద్దింక కనిపించడంతో షాకైన ప్రయాణికుడు దాన్ని ఫొటో తీసి ట్విట్టర్‌లో పెట్టి ‘నా డబ్బులు రీఫండ్ చేయండి’ అని ఆదివారం పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఐఆర్‌సీటీసీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకొంటామని అతడి ట్వీట్‌కు బదులిచ్చింది.