కాలం దాదాపు 35 ఏళ్ల తరువాత తల్లీ కొడుకును కలిపింది. వరద రెస్క్యూ వాలంటీర్ జగ్జీత్ సింగ్ మూడున్నర దశాబ్దాల తరువాత తల్లిని కలుసుకున్నాడు. సినిమా ట్విస్టులను తలపించే కథ వీరిది. పంజాబ్‌కు చెందిన జగ్జిత్ సింగ్ పాటియాలాలో వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లి తన తల్లిని కలుసుకున్నాడు. వివరాలు.. జగ్జిత్‌కు ఆరు నెలల వయసున్నప్పుడు అతడి తండ్రి చనిపోయాడు. దీంతో అతడి తల్లి మరో పెళ్లి చేసుకుంది. జగ్జిత్‌కు రెండేళ్ల వయసున్నప్పుడు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయిన తాతయ్య, నానమ్మ తమ దగ్గరికి తీసుకొచ్చుకున్నారు. ఆలనా పాలనా వాళ్లే చూసుకున్నారు. 20 ఏళ్ల క్రితం వాళ్ల కుటుంబం హర్యానా నుంచి పంజాబ్‌లోని ఖడియాన్‌కు షిఫ్ట్ అయ్యింది. జగ్జిత్ పెరిగే కొద్ది తల్లి గురించి అడుగుతుండగా ప్రమాదంలో తల్లీతండ్రి చనిపోయారని చెప్పేవారు.
37 ఏళ్ల జగ్జిత్ ప్రస్తుతం ఎన్జీఓ హోం నడుపుతున్నాడు. దానితోపాటు ఖదియాన్‌లో గురుద్వారాలో ఆధ్యాత్మిక గాయకుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల భారీ వర్షాలు, వరదలు పాటియాలాను ముంచెత్తడంతో జగ్జిత్ తన ఎన్జీవో సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లాడు. అక్కడ సహాయక చర్యలు చేపడుతుండగానే జగ్జిత్‌కు అతడి అత్త ఒకరు ఫోన్ చేశారు. జగ్జిత్ అమ్మమ్మ కుటుంబం నివసించేది అక్కడేనని, అడ్రస్ తెలీయదని, బొహార్‌పూర్ అనే ఊళ్లో ఉంటుండొచ్చని చెప్పింది. దీంతో అమ్మమ్మ కుటుంబం ఆచూకీ కనుగొనడం కోసం గజ్జిత్ తీవ్రంగా గాలించారు. చివరకు తన అమ్మమ్మ ఇంటి అడ్రస్ కనుక్కున్నాడు. వాళ్ల ఇంటికి వెళ్లాడు. తన అమ్మమ్మ ఆమె ఔనో కాదో తెలుసుకోవడానికి వరుసబెట్టి ప్రశ్నలు వేశాడు.
మొదట్లో అనుమానంగా చూసిన ఆమె.. చివరకు ‘నా కుమార్తె హర్జిత్‌కు మొదటి పెళ్లి ద్వారా ఓ కొడుకు పుట్టాడు. ప్రస్తుతం ఎలా ఉన్నాడో తెలియదు’ అని చెప్పింది. దీంతో జగ్జిత్ ఏడుపు ఆపుకోలేకపోయాడు. తనే దురదృష్టవంతుణ్ని అంటూ కన్నీరు మున్నీరు అయ్యాడు. కొద్ది సేపటికి తల్లి హర్జిత్ కౌర్‌ను చూశాడు. కాళ్ల నొప్పి కారణంగా సరిగా నడవలేకపోతున్న తల్లిని పట్టుకుని బోరున విలపించాడు. తరువాత తన కుటుంబం గురించి వివరించాడు. తన కష్టసుఖాలు తల్లికి చెప్పుకున్నాడు.
35 ఏళ్ల తర్వాత కొడుకును చూసిన ఆనందంలో హర్జీత్ సంతోషం పట్టలేకపోయింది. కొడుకును పట్టుకుని కంటనీరు పెట్టుకుంది. వాస్తవానికి జగ్జిత్‌కు తన తల్లి బతికే ఉందని ఐదేళ్ల క్రితం తెలిసింది. అయితే అప్పటికే తాతయ్య, నానమ్మ, పెద్దమ్మ, పెదనాన్న ఇలా తెలిసిన వారందరూ చనిపోవడంతో.. తన తల్లి ఎవరో? ఎక్కడ ఉంటుందో? తెలుసుకోలేకపోయాడు. జగ్జిత్ తన చిన్నతనంలో దిగిన ఫొటోలను చూసినప్పుడు.. ఒక మహిళతో కలిసి ఉన్న ఫొటోను గమనించానని తానే తన తల్లి అని తెలుసుకోలేకపోయానని వాపోయాడు. జగ్జిత్ విషయానికి వస్తే అనికి 14 ఏళ్ల కుమార్తె, 8 ఏళ్ల కొడుకు ఉన్నారు. తన భార్యా పిల్లలతో కలిసి వెళ్లిన అతడు తొలిసారి తన కన్నతల్లిని కలుసుకున్నాడు. తన ఆనందాన్ని ఫేస్‌బుక్ వేదికగా పంచుకున్నాడు. సినిమా కథను తలపించే స్టోరీ విన్న నెటిజన్లు జగ్జిత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.