Viral News: రెండు నిమిషాలు హిందీలో మాట్లాడినందుకు ఓ ఇండో అమెరికన్ ఇంజినీర్ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. చావుబతుకుల్లో ఉన్న బంధువుతో ఫోన్‌లో హిందీలో మాట్లాడాడని యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించంది. దీనిపై సదరు వ్యక్తి కోర్టు కెక్కాడు. తనను ఉద్దేశపూర్వకంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. వివరాలు.. భారత సంతతికి చెందిన అనిల్ వర్ష్నే (78) అమెరికాలో 2002 నుంచి అమెరికాలో ప్రముఖ మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ విభాగంలో పార్సన్స్ కార్పొరేషన్ అనే సంస్థలో సీనియర్ సిస్టమ్స్ ఇంజనీర్‌గా పనిచేసేవారు.
2022 సెప్టెంబర్ 26న అనిల్ భారత్‌లోని ఆస్పత్రిలో చావు బ్రతుకుల్లో ఉన్న తన బావ కేసీ గుప్తాతో వీడియో కాల్ మాట్లాడాడు. ఆఫీస్‌లో ఎవరూ లేనిచోట సమయంలో మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ (MDA)కి చెందిన వారు ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఖాళీ క్యాబిన్‌లో అనిల్ 2 నిముషాల పాటు మాట్లాడాడు. అయితే అనిల్ ఫోన్‌లో మాట్లాడటం చూసిన సహోద్యోగి ఒకరు ఇక్కడ ఫోన్ మాట్లాడకూడదని వారించాడు. దీంతో కాల్ కట్ చేశాడు. అదే అతని పాలిట శాపమైంది.
గూఢచారి ముద్ర!
దీనిపై సహోద్యోగి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. తనకు అర్ధం కాని భాషలో అనిల్ ఫోన్ కాల్ మాట్లాడాడని, ఏజెన్సీకి సంబంధించిన గోప్య సమాచారం చేరవేశాడని ఆరోపించారు. ఫోన్ మాట్లాడి భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించాడనే ఆరోపించడంతో ఉన్నతాధికారులు అప్పటికప్పుడు అతన్ని ఉద్యోగం నుంచి అప్పటికప్పుడు తొలగించారు. అంతేకాకుండా భవిష్యత్తులో మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీలో పనిచేయకుండా బ్లాక్ మార్క్ జారీ చేశారు. దీంతో అనిల్ జులై 24న సదరు ఏజెన్సీ కంపెనీపై కోర్టును ఆశ్రయించాడు. తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని, వివక్షపూరితంగా పక్షపాతంతో తనపై ఆరోపణలు చేశారంటూ తన దావాలో పేర్కొన్నారు. సంస్థ చర్యలతో గత సెప్టెంబర్ నుంచి తాను ఉపాధి కోల్పోయానని, తనను మానసిక క్షోభకు గురి చేశారని వాపోయారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో తేల్చడానికి విచారణ కూడా చేయలేదని ఆరోపించాడు. అంతేకాకుండా కోర్టులో లాయర్ల ఫీజులు, ఖర్చులు కూడా కంపెనీయే భరించాలని దావాలో డిమాండ్ చేశారు.
1968లో అమెరికాకు వలస
1968లో అమెరికాకు వలస వచ్చిన వర్ష్నీ అమెరికా పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడ్డాడు. ఆయన భార్య శశి 1989 నుంచి నాసాలో పనిచేస్తోంది. సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగంలో భూమి ఆధారిత క్షిపణి రక్షణ కార్యక్రమంలో 5 మిలియన్లను ఆదా చేసినందుకు ఇదే కంపెనీలో ‘కాంట్రాక్టర్ ఆఫ్ ది ఇయర్’గా ప్రపంశలు కూడా అందుకున్నాడు. బాలిస్టిక్ క్షిపణి బెదిరింపుల నుంచి అమెరికాను, దాని భాగస్వామ్య దళాలను రక్షించే సమీకృత, లేయర్డ్ క్షిపణి రక్షణ వ్యవస్థల అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని దావాలో పేర్కొన్నాడు. తన పూర్వ ఉద్యోగ రికార్డులను సైతం దావాలో పొందుపరిచాడు. తనపై వేసిన క్రమశిక్షణ రాహిత్య చర్యలను ఉపసంహరించుకోవాలని వర్ష్నీ కోరారు. ఒక వేళ తనను తిరిగి ఉద్యోగంలో చేర్చుకోకపోతే పూర్తి ప్రయోజనాలతో కూడిన ముందస్తు చెల్లింపులు, న్యాయవాద రుసుము, మానసిక వేదన అనుభవించినందుకు నష్టపరిహారాన్ని కోరారు. ఇక దీనిపై పార్సల్స్ కంపెనీ ఇంకా స్పందించలేదు.