Inspiring: కాలం మారింది. ఒకప్పుడు బడికి వెళ్లాలంటే కొండలు, గుట్టలు, వాగులు దాటుకుని కాలినడక వెళ్లాల్సి వచ్చేది. చిరిగిన, మాసిన దుస్తులతో బడికి వెళ్లేవారు. చదువు అంటే అంత ఇష్టంగా ఉండేవారు. ఆ ప్రయాణంలో ఎన్నో మజిలీలు ఉండేవి. కాల క్రమేణా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు యూనిఫాంలు, ఇంటి వద్దకే బస్సు వస్తోంది. అన్ని సదుపాయాలు ఉన్నాయి. అయినా చదువుకోవడానికి చాలా మందికి ఇష్టం ఉండడం లేదు. ఇన్‌స్టాగ్రాంలో రీల్స్, యూట్యూబ్‌లో షార్ట్ చేస్తూ, సోషల్ మీడియాలో సరదాగా గడిపేస్తుంటారు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అంటారా? చదువు కోసం ఓ వృద్ధుడు చేస్తున్న ప్రయత్నాల గురించి చదవితే మీకు ఔనా.. ! నిజమా..! అనిపిస్తుంది. 


మిజోరాం-మయన్మార్ సరిహద్దులోని చంపై జిల్లాలో ఓ వృద్ధుడు ఎండొచ్చినా.. వానొచ్చినా ఓ వృద్ధుడు 78 ఏళ్ల వయసులో ప్రతి రోజూ 3 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్తున్నాడు. ఇంగ్లిష్ అప్లికేషన్లు నింపడం, టీవీలో వచ్చే ఇంగ్లీష్ వార్తలను అర్థం చేసుకోవడానికి చదువు అవసరమవడంతో లేటు వయసులో బోసి నవ్వులతో బడికి వెళ్తున్నాడు. 1945లో చంపై జిల్లాలోని ఖువాంగ్‌లెంగ్ గ్రామంలో లాల్రింగ్‌థరా జన్మించాడు. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు. దీంతో తల్లికి సాయం చేయడానికి, జీవనోపాధి కోసం తల్లితో పాటు పొలం పనులకు వెళ్లేవాడు. పేదరికం, ప్రతికూల పరిస్థితులు ఆయన చదువుకోకుండా చేశాయి. అయితే చదువుకోవాలనే ఉత్సాహం మాత్రం ఆయనలో తగ్గలేదు. పరిస్థితులు అనుకూలించినప్పుడల్లా చదువుకునేవాడు. 


లాల్రింగ్‌థరా రెండో తరగతి వరకు ఖువాంగ్‌లెంగ్‌లో చదువుకున్నాడు. 1995లో అతని తల్లి న్యూ హ్రూయికాన్ గ్రామానికి వలస వెళ్లడంతో అతని చదువుకు విరామం వచ్చింది. ఆర్థిక పరిస్థితులు బాగాలేక పోవడంతో కొంత కాలం కుటుంబానికి అండగా నలిచాడు. మూడు ఏళ్ల తరువాత లాల్రింగ్‌థరాను తల్లి ఐదో తరగతిలో చేర్చింది. కానీ మరో సారి కష్టాల్లో చిక్కుకోవడంతో చదువును కొనసాగించాలనే అతని కల కొద్దికాలం ఆగిపోయింది. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా దూరపు బంధువుల వరి పొలాల్లో లాల్రింగ్‌థరా పని చేస్తూ జీవనం సాగించేవాడు. పెద్దగా చదువుకోక పోయినా మిజో భాషలో అక్షరాస్యతను సాధించగలిగాడు. ప్రస్తుతం చర్చి చౌకీదార్‌గా పనిచేస్తున్నాడు.


కొన్నేళ్లకు లాల్రింగ్‌థరా 8వ తరగతి ఉత్తీర్ణత సాధించాడు. ఆయన ఈ ఏడాది ఏప్రిల్‌లో అడ్మిషన్ కోసం హ్రూయికాన్‌లోని స్థానిక రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఉన్నత పాఠశాలకు వెళ్లాడు. మొదట ఆశ్చర్యానికి గురయ్యారు. 78 ఏళ్ల వయసులో చదువుకోవడం ఏంటి అనుకున్నారు. కానీ లాల్రింగ్‌థరా తన ఆసక్తి, ఆశయాన్ని వారికి చెప్పడంతో ఉపాధ్యాయులు ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. 9వ తరగతిలో ప్రవేశం కల్పించారు. పుస్తకాలు, యూనిఫాం కూడా ఇచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక ఈ వయస్సులో కూడా పాఠశాలకు తిరిగి వచ్చేలా చేసిందని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఇంగ్లిష్‌లో అప్లికేషన్లు (దరఖాస్తులు)ను రాయగలగడం, టీవీలో ప్రసారమయ్యే ఆంగ్ల వార్తలను అర్థం చేసుకోవడం వృద్ధుడి లక్ష్యం అన్నారు. చదువుకోవడానికి, జ్ఞానం సంపాదించుకోవడానికి  వయసు అడ్డం కాదని  లాల్రింగ్‌థరా నవ్వుతూ చెబుతారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial