IAS officer transferred:


దిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో పెంపుడు కుక్కతో ఐఏఎస్ అధికారి వాకింగ్ చేసిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్​ అయింది. స్టేడియాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై దిల్లీ రెవెన్యూ కార్యదర్శి సంజీవ ఖిర్వార్ దంపతుల​ను బదిలీ చేసింది.


AGMUT క్యాడర్‌కు చెందిన 1994-బ్యాచ్ ఐఏఎస్​ అధికారి ఖిర్వార్‌ను లద్దాఖ్​కు, ఆయన భార్య అను దుగ్గాలను అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.


ఇదీ జరిగింది


ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ దిల్లీ రెవెన్యూ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన తన శునకంతో పాటు స్టేడియంలో వాకింగ్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో అక్క‌డ శిక్ష‌ణ పొందుతున్న వారితో పాటు నిత్యం ప్రాక్టిస్ చేయ‌డానికి వ‌స్తున్న క్రీడాకారులు, అథ్లెట్లు, కోచ్ లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు ఐఏఎస్ అధికారిపై నెటిజన్లు సీరియస్ అయ్యారు.


కొన్ని రోజులుగా త్యాగరాజ్ స్టేడియంలోని అథ్లెట్లు, కోచ్‌లు సాధారణ సమయం కన్నా ముందుగానే అంటే సాయంత్రం 7 గంటలలోపు వారి శిక్షణ ముగించేలా ఒత్తిడి తెస్తున్నారు. దీని కార‌ణంగా అథ్లెట్లు, ఇత‌ర క్రీడాకారులు శిక్ష‌ణ‌పై ప్ర‌భావం ప‌డుతుందని కోచ్‌లు, క్రీడాకారులు చెబుతున్నారు. ప్ర‌తిరోజు సాయంత్రం 7 గంట‌ల త‌ర్వాత సంజీవ్ ఖిర్వార్ తన కుక్కతో అక్క‌డికి వాకింగ్ వ‌స్తారు. 


త్యాగరాజ్ స్టేడియం 2010 కామన్వెల్త్ గేమ్స్ కోసం నిర్మించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులతో పాటు ఫుట్‌బాల్ క్రీడాకారుల‌కు శిక్ష‌ణ ఇస్తారు. 


ఖండించిన ఖిర్వార్


ఈ ఆరోపణలపై స్పందించిన ఐఏఎస్ అధికారి ఖిర్వార్.. తాను ఒక క్రీడాకారుడ్ని కూడా స్టేడియం వదిలి వెళ్ళమని ఎప్పుడూ చెప్పలేదన్నారు.



స్టేడియం మూసేసిన తర్వాత నేను బయలుదేరుతాను. మేం కుక్కను ట్రాక్‌పై వదిలిపెట్టం. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే దానిని విడిచిపెట్టాం. అందులో అభ్యంతరకరం ఏదైనా ఉంటే ఆపేస్తాను.                                                       "
-సంజీవ్ ఖిర్వార్, ఐఏఎస్



కేజ్రీవాల్ స్పందన 


ఈ విష‌యం ప్ర‌భుత్వ దృష్టికి రావ‌డంతో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చర్యలు చేపట్టారు. త్యాగరాజ్ స్టేడియం మూసివేత‌కు సంబంధించిన విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చిందన్నారు. త్యాగరాజ్ స్టేడియంతో పాటు దిల్లీలోని అన్ని ప్రభుత్వ స్టేడియంలను రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు క్రీడాకారుల‌కు, అథ్లెట్ల‌కు అందుబాటులో ఉంచాల‌ని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు.


Also Read: Viral Video: కాక్‌పిట్‌లోనే అంతా కానిచ్చేశారు- ట్రైనీతో పైలట్ రొమాన్స్!


Also Read: Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు- 14 మంది మృతి