Rahul Gandhi Viral Video: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బ్రిటన్‌ పర్యటనపై వివాదాలు నెలకొన్నాయి. యూకే లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్‌తో రాహుల్ భేటీపై బీజేపీ ప్రశ్నలు సంధించింది. భారత్ నుంచి కశ్మీర్‌ను విడదీయాలని గతంలో వ్యాఖ్యానించిన, హిందూ వ్యతిరేకి అయిన బ్రిటీష్ నాయకుడిని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కలిశారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కార్బిన్‌తో రాహుల్ గాంధీ సమావేశానికి సంబంధించిన చిత్రాన్ని బీజేపీ షేర్ చేసింది. అదే సమయంలో, రాహుల్ కు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. అందులో అతను ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో రాహుల్ గాంధీ తీవ్రంగా తడబడ్డారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రాహుల్ గాంధీని అడిగిన ప్రశ్న హింస, అహింసకు సంబంధించింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. మరింత సమర్థంగా మాట్లాడేందుకు ఒక స్క్రిప్ట్‌ను ఉపయోగించండి అంటూ ఎద్దేవా చేశారు.


ఆయన షేర్ చేసిన వీడియోలో, డాక్టర్ శ్రుతి కపిల కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీని ఓ ప్రశ్న అడిగారు. ‘‘నా ప్రశ్న నిజానికి హింస, దానితో జీవించడం గురించి.. భారతీయ సమాజంలో హింస మరియు అహింస మధ్య సంఘర్షణను మీరు ఎలా చూస్తారు? ఇంకా దానిని మేనేజ్ చేయడంలో మీ అనుభవం గురించి కొంత చెప్పగలరు.’’ అని ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న విన్న తర్వాత రాహుల్ గాంధీ చాలా సేపు మౌనం వహించారు. అది జవాబు చెప్పలేకపోయినట్లుగా అర్థం అవుతోంది.


‘‘నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. ఇది సహజమైన ప్రశ్న’ అని శ్రుతి కపిల అన్నట్లు వీడియోలో ఉంది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరూ అడగకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉందని అన్నారు. లేదని ఆ ప్రశ్న అంతకుముందు తనను అడిగారని రాహుల్ గాంధీ అన్నారు. 


ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి, 2019 లోక్‌సభ ఎన్నికలలో రాయ్‌బరేలీ నుండి పోటీ చేసిన దినేష్ ప్రతాప్ సింగ్ ఈ వీడియోను షేర్ చేశారు. రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తూ కామెంట్లు కూడా చేశారు.