Rats On Food In IIT Roorkee Kitchen: ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీలోని (IIT Roorkee) హాస్టల్ మెస్‌లో ఎలుకల సంచారం కలకలం రేపింది. కిచెన్‌లో ఆహారంపై ఎలుకలు తిరగడాన్ని విద్యార్థులు గమనించి.. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి వైరల్‌గా మారగా.. తమకు అందిస్తోన్న ఆహారం నాణ్యతపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం కొందరు విద్యార్థులు భోజనం కోసం క్యాంపస్‌లోని రాధా కృష్ణ భవన్ మెస్‌కు వెళ్లారు. ఆహారం తయారు చేసే వంటగదిలోని కుక్కర్‌తో పాటు పలు పాత్రల్లో ఎలుకలు ఉండడాన్ని గుర్తించారు. నాణ్యత లేని, పాడైన ఫుడ్ తమకు పెడుతున్నారని ఆరోపించారు. ఆహార పరిశుభ్రత విధానాలను ప్రశ్నిస్తూ.. నిరసన తెలిపారు.
ఈ వీడియోలు వైరల్ కాగా.. విద్యార్థులతో పాటు నెటిజన్లు సైతం స్పందించారు. ఇలాంటి ఘటనల కారణంగానే వర్శిటీ హాస్టల్ వీడినట్లు ఓ విద్యార్థిని తెలిపింది. ఇలాంటి వాటి వల్ల ప్రతిష్టాత్మక విద్యాసంస్థల గౌరవం దిగజారుతోందని మరికొందరు విద్యార్థులు కామెంట్ చేశారు. వర్శిటీ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని.. తమకు నాణ్యమైన ఆహారం అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.