Section 144 Clamped In Nuh As Police Deny Permission For Shobha Yatra:


ఇటీవల జరిగిన అల్లర్లు హరియాణాను రణరంగంగా మార్చేశాయి. ముఖ్యంగా నూహ్ ప్రాంతంలో శోభా యాత్ర నిర్వహించిన సమయంలో మత సంబంధమైన గొడవ విధ్వంసానికి దారి తీయడం తెలిసిందే. దాంతో పోలీసులు, అధికారుుల అక్కడ కొన్ని రోజులపాటు ఆంక్షలు విధించారు. తాజాగా అలాంటి పరిస్థితే మరోసారి తలెత్తనుందని భావించి నుహ్ జిల్లాలో 144 సెక్షన్ విధించారు.
 
విశ్వహిందూ పరిషత్ (VHP) ఆగస్టు 28న మేవాత్ లో శోభా యాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల నుహ్ లో జరిగిన మతపరమైన గొడవలు విధ్వంసానికి దారితీయడంతో ఇక్కడ అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందే అలర్ట్ అయ్యారు. నూహ్ డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత జిల్లాలో ఆంక్షలు విధించారు. వీహెచ్‌పీ తలపెట్టిన శోభా యాత్రకు అనుమతి నిరాకరించడంతో పాటు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఇలాంటి యాత్రలు నిర్వహించాలనుకుంటే కచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతి నిరాకరిస్తే ఏ కార్యక్రమం జరపకూడదని, కాదని ముందుకు సాగితే చర్యలు తీసుకుంటామని వీహెచ్‌పీ సభ్యులను హెచ్చరించారు.


ఆగస్ట్ 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 28 అర్థరాత్రి 12 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. నూహ్ డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత ఏఎన్ఐతో మాట్లాడుతూ.. కొందరు శోభాయాత్ర (బ్రాజ్ మండల్ శోభా యాత్ర) నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని భావించి శోభాయాత్రకు అనుమతి ఇవ్వలేదన్నారు. అక్కడ 144 సెక్షన్ విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. 


జిల్లాలో జులై చివర్లో జరిగిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా ఘర్షణ జరిగింది. జూలై 31న విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలో ఇద్దరు హోంగార్డులు, ఒక మత గురువుతో సహా ఆరుగురు మరణించారు. ఈ పరిస్థితుల్లో మరోసారి ఎలాంటి హింసాత్మక సంఘటన జరగకూడదని పోలీసులు నుహ్ ప్రాంతంలో ఆంక్షలు విధిస్తున్నారు. నుహ్ విధ్వంసం కేసులో తాజాగా ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు చూడగా, కొందరు నిందితులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.


అనుమతి అవసరం లేదన్న వీహెచ్‌పీ! 
వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ ఇటీవల మాట్లాడుతూ.. శోభా యాత్రకు మేవాత్ సర్వ హిందూ సమాజ్ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. ఊరేగింపు గురించి అధికారులకు తెలియజేస్తాం అన్నారు. సెప్టెంబరు ప్రారంభంలో తలపెట్టాలని భావించిన శోభా యాత్ర.. జీ20కి ఎలాంటి సమస్యగా మారదన్నారు. అందుకే ఈ నెలాఖరుకు శోభాయత్రను షెడ్యూల్ చేశామని, ఆగస్టు 28న ఘనంగా ఊరేగింపు నిర్వహించాలని వీహెచ్‌పీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 


‘ మేవాత్ కు చెందిన సర్వ హిందూ సమాజ్ మా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 28 న జలాభిషేక యాత్రను నిర్వహించాలని భావిస్తున్నాం. కానీ ఇలాంటి కార్యక్రమాలకు అధికారుల నుంచి మాకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. ఎందుకంటే కన్వర్ యాత్ర, మొహర్రం లాంటి ఇతర ఊరేగింపులకు వారు అనుమతి తీసుకుంటున్నారా. అదే విధంగా తాము చేయాల్సిన పనిని కొనసాగిస్తామని’  జైన్ చెప్పినట్లు పిటిఐ పేర్కొంది.