Aditya L1 Mission: చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ ను విజయవంతంగా దించిన ఇస్రో.. ఇప్పుడు అదే జోష్ లో మరో మిషన్ చేపట్టేందుకు సిద్ధమైంది. సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్-1 మిషన్ ను వచ్చే నెల 2వ తేదీన చేపట్టాలని ఇస్రో నిర్ణయించింది. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ (షార్) కు తీసుకువచ్చినట్లు ఇస్రో అధికారులు తెలిపారు. పీఎస్ఎల్వీ సి57 వాహక నౌక.. ఈ ఆదిత్య ఎల్-1 ను మోసుకు వెళ్లనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. ఈ శాటిలైట్ ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్-1 వద్ద కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులు, సౌర వ్యవస్థ, సౌర తుపానులు సహా ఇతర పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. 


ఈ ప్రయోగం కోసం ఇస్రో ఏడు పేలోడ్స్ ను తీసుకెళ్లనుంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా(సూర్యుడి బయటి పొర) పై అధ్యయనం చేయడంలో ఉపయోగపడనున్నాయి. పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ సోలార్ మిషన్ కోసం పేలోడ్స్ ను అభివృద్ధి చేశాయి. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించనుంది ఇస్రో. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది. ఆదిత్య-ఎల్‌1లోని నాలుగు పేలోడ్‌లు నేరుగా సూర్యుడిని పరిశీలించనున్నాయి. మిగిలిన మూడు పేలోడ్‌లు ఎల్‌ - 1 పాయింట్ వద్ద కణాలు, క్షేత్రాలకు సంబంధించి పరిశీలనలు చేయనున్నాయి.


Also Read: Working-Age Populations: 2030 నాటికి భారత్‌లో భారీగా వర్కింగ్ ఏజ్ పాపులేషన్‌, మెకిన్సే నివేదిక ఏం చెప్పిందంటే?



  • సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేస్తున్న తొలి మిషన్ ఇది.

  • ఈ శాటిలైట్ బరువు 1500 కిలోలు

  • భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 (L-1) చుట్టూ ఉన్న కక్ష్యలో దీనిని ప్రవేశపెట్టనున్నారు.

  • ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అద్యయనం చేసే వీలు ఉంటుంది.

  • ఆదిత్య ఎల్-1 మొత్తం 7 పేలోడ్స్ ను తీసుకెళ్లనుంది.

  • విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ తో పాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ పేలోడ్ లను అమర్చనున్నారు.

  • సూర్యుడి నుంచి వచ్చే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్లను తయారు చేశారు.

  • పేలోడ్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేయనున్నాయి.

  • ఎల్-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్ాయ 4 పేలోడ్స్ నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. 

  • 3 పేలోడ్లు సూర్యుడికి సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి పరిశోధిస్తాయి.