Vande Bharat Train: ఉదయ్‌పూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. కొందరు దుండగులు వందే భారత్ రైలుపై పెద్ద పెద్ద రాళ్లు పెట్టి పట్టాలు తప్పించేందుకు కుట్ర చేశారు.  రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో వేలాది మంది ప్రయాణికులు ప్రాణాలు రక్షించబడ్డాయి. వివరాలు... రాజస్థాన్‌ రాష్ట్రంలోని భిల్వారా సమీపంలో ఉదయపూర్ - జైపూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పించేందుకు కొందరు దుర్మార్గులు.. చిత్తౌర్ గఢ్ జిల్లా గంగారార్ పరిధిలోని భిల్వారా సమీపంలో కొందరు వ్యక్తులు ట్రాక్ పై రాళ్లు పేర్చారు. ట్రాక్ లోని ఇనుప ప్లేట్‌ల మధ్యలో  అడుగు పొడవున్న రెండు రాడ్లను చొప్పించారు.  అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి.. రైలును ఆపేశారు.






విషయం తెలుసుకున్న భిల్వారా సీనియర్ సెక్షన్ ఇంజనీర్, స్థానిక పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాళ్లు, రాడ్లను తొలగించారు. ట్రాక్‌పై రెండు అడుగుల పొడవున్న రాడ్‌లు ఉన్నాయని, లోకో అప్రమత్తంగా వ్యవహరించి అత్వసర బ్రేకులను ఉపయోగించి రైలును ఆపినట్లు రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్‌ఓ) షాహి కిరణ్ తెలిపారు. ట్రాక్‌పై ఉన్న శిథిలాలను తొలగించాడని, వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారని, వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీసు (జీఆర్పీ)లను సంఘటనా స్థలానికి పంపినట్లు ఆయన చెప్పారు.


అలాగే సంఘ విద్రోహులపై కేసు నమోదు చేసి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని షాహి కిరణ్ చెప్పారు. ఆ తర్వాత వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ముందుకు కదలింది. ఈ ఘటనకు  సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. వందే భారత్ రైళ్లపై ఇప్పటికే చాలా సార్లు దాడులు జరిగాయి. గత ఐదు నెలల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై దాడి చేయడంతో దెబ్బతిన్న 40 విండో మరియు డోర్ అద్దాలను మార్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఢిల్లీ - ఆగ్రా మార్గంలో నడుస్తున్న ఈ రైలుపైనే రాళ్ల దాడి ఎక్కువగా జరిగాయి. 


ఢిల్లీ - భోపాల్ మధ్య నడిచే వందే భారత్ రైలు మధ్యాహ్నం రాళ్ల దాడిలో దెబ్బతింది. ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మధుర జిల్లాలోని ఓఖ్లా స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. దాడిలో C-5, E-1 అనే రెండు కోచ్‌ల కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులపై ఆర్పీఎఫ్ కోసికలన్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగ్రా కాంట్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, పగిలిన అద్దానికి తాత్కాలికంగా మరమ్మతులు చేశారు.  


వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై గతంలో ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో C 12 కోచ్ ఎమర్జెన్సీ విండో ధ్వంసం అయ్యింది. రైలు విశాఖ చేరుకున్న తర్వాత సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టి విండోను మార్చారు. కొద్ది రోజుల క్రితం కేరళలోని కోజికోడ్ జిల్లాలోని వటకర వద్ద వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. దాడిలో ఈ రైలు C-8 కోచ్ అద్దాలు పగిలిపోయాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు.